టీడీపీకి ఊహించని దెబ్బ.. బీజేపీలోకి పరిటాల కుటుంబం!!

 

ఘోర పరాజయం చవిచూసిన టీడీపీకి.. పార్టీ సీనియర్ నేతలు మరింత షాక్ ఇవ్వడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. రాబోయే ఐదేళ్ల కాలంలో తాము.. వైసీపీని ఎదుర్కోలేమన్న భావనతో కొందరు నేతలు బీజేపీ పంచన చేరాలని చూస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వర్గపోరు, ముఠాకక్షలు ఎక్కువగా ఉన్న రాయలసీమలోని టీడీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారట. వారు సామాన్య నేతలు కూడా కాదు. రాయలసీమ టీడీపీకి ఐకాన్‌గా నిలిచిన దివంగత పరిటాల రవి కుటుంబం ఇప్పుడు బీజేపీ అండ కావాలని కోరుకుంటోందని ప్రచారం జరుగుతోంది. తమ కుటుంబానికి శత్రువులుగా పేరొందిన వారు.. ఈ ఎన్నికల్లో గెలిచారని, వారితో తమ ప్రాణాలకు ముప్పు ఉందని, దాంతో.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే ప్రాణముప్పు ఉండదనే భావన వారిలో ఉందట.

గతంలో పరిటాల రవి హత్య చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన తగు జాగ్రత్తలు తీసుకుని విదేశాలకు వెళ్లాలని ఆయన సన్నిహితులు కొందరు సూచించినా.. ఆయన లెక్క చేయలేదని, చివరకు.. ఆ నిర్లక్ష్యం ఆయన ప్రాణాలను తీసిందని, ఈసారి మాత్రం అటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే భావనతో.. పార్టీ మారితే ఎలా ఉంటుందనే చర్చ పరిటాల కుటుంబంలో జరుగుతుందని ఆ కుటుంబానికి దగ్గరైన వ్యక్తులు చెబుతున్నారు.

2014 ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసి గెలిచిన పరిటాల సునీత తరువాత ఐదేళ్లు మంత్రిగా వ్యవహరించారు. అయితే ఈ ఎన్నికల్లో కుమారుడు శ్రీరామ్ ని బరిలో నిలిపారు. కానీ శ్రీరామ్ ఓడిపోయారు. ఈ నేపథ్యంలో టీడీపీలో ఉంటే కుమారునికి హాని జరుగుతుందనే ఆందోళనతో.. పరిటాల కుటుంబీకులు పార్టీ మారాలనే ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

దీనిలో నిజమెంతో కానీ.. ప్రస్తుతం రాప్తాడులో తోపుదుర్తి బ్రదర్స్‌ కత్తులతో వీరవిహారం చేయడం గమనిస్తే.. అటువంటి చర్యలు జరిగే ప్రమాదం ఉందనే భావన ప్రజల్లో ఉంది. ఎన్నికల్లో గెలిచిన తోపుదుర్తి బ్రదర్స్‌ వేటకొడవళ్లతో నియోజకవర్గంలో ఊరేగింపులు చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో ఈ ఐదేళ్లు ఎలా గడపాలన్న ఆందోళన కొందరు టీడీపీ నాయకుల్లో కనిపిస్తోంది.