TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గోవిందా గోవిందా..జగన్ బాదుడే బాదుడుపై పేరడీ వీడియో వైరల్

Published on: Wed Jun 1, 2022 5:34PM

జగన్ పాలనపై, ఆయన హయాంలో ధరల పెరుగుదలపై తిరుమల స్వామి వారి గోవిందనామాల శైలిలో రూపొందించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాన్ని షేక్ చేసేస్తోంది. ఈ వీడియో ఎవరు రూపొందించారన్న స్పష్టత లేకపోయినప్పటికీ దీనికి తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోస్టు చేశారు. జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సమర శంఖం పూరించింది.   బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా దూకుడుగా ప్రజలోకి వెళుతోంది. బాదుడే బాదుడు అంటూ చంద్రబాబు కూడా జిల్లాల పర్యటనల్లో పలు రోడ్ షోలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జనం నుంచి భారీ  స్పందన వచ్చింది.

ఆ ఉత్సాహం తెలుగుదేశంలో ఉరకలేస్తుండగానే  ఒంగోలు వేదికగా జరిగిన తెలుగుదేశం   మహానాడు అంచనాలకు మించి విజయవంతం అయ్యింది. దీంతో తెలుగుదేశంలో లీడర్ నుంచి కేడర్ వరకు అందరిలో కొత్త జోష్ కనిపిస్తున్నది.  సీఎం జగన్ పట్ల జనంలో గూడు కట్టుకున్న వ్యతిరేకతే మహానాడు విజయ రహస్యమంటూ చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఇదే టెంపో ఇలాగే కొనసాగిస్తూ, జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలలోకి వెడితే.. జగన్ ను గద్దె దింపడం ఖాయమని తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టత వచ్చింది.  దాంతో క్షణం ఆలస్యం చేయకుండా ఆ దిశగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి కార్యాచరణ ప్రారంభించేందుకు తెలుగుదేశం శ్రీకారం చుట్టింది. 

ఇందులో భాగంగానే  తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు  అచ్చెన్నాయుడు తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. సదరు వీడియో సామాజిక మాధ్యమంలో విపరీతంగా వైరల్ అయ్యింది.  ‘బాదుడే బాదుడు బాదుడే బాదుడు.. ఏడుకొండలవాడా.. వెంకటరమణా గోవిందా గోవిందా.. ఆపద మొక్కుల వాడా.. అనాధ రక్షక..గోవిందా గోవిందా’ అంటూ మొదలైన ఈ వీడియో దాదాపు 2 నిమిషాల 20 సెకన్లు ఉంది. ఆ వీడియోలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన ఛార్జీలు, పెంచిన పన్నులతోపాటు పప్పులు ఉప్పుల ధరలు సైతం ఆకాశాన్నంటాయంటూ ఈ గోవింద నామాల్లో వాటిని సైతం చేర్చారు.

  ఈ జగన్ ప్రభుత్వం ప్రజలపై పన్నులు, ఛార్జీల భారాన్ని మోపి.. పీడిస్తోందనే కాన్సెప్ట్‌లో ఈ సాగిన ఈ గోవింద నామాల పేరడీ వీడియో  సామాజిక మాధ్యమంలో జెట్ స్పీడ్ లో వైరల్ అవుతోంది. లక్షల వ్యూస్ తో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.   ఈ బాదుడే బాదుడు వీడియోపై నెటిజన్లు   తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇదో ట్రెండ్ అంటూ కొందరు పేర్కొంటే.. ఈ జగనన్న ఏడుకొండలవాడిని సైతం వదల్లేదంటూ  కామెంట్లు పెడుతున్నారు.   ఈ వీడియో మాత్రం జగన్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కడుపు మండి రూపొందించిందనేది స్పష్టంగా అర్ధమౌతోందని  నెటిజన్లు అంటున్నారు. మరోవైపు.. ఈ  పేరడీ గోవంద నామాలతో  జగన్ ఆయన టీం కు దిమ్మతిరిగి ఉంటుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.