ఇక పై కర్ణాటక జైలు నుంచీ తమిళనాడు పాలన!

 

తమిళనాడు అసెంబ్లీ గొడ్ల సంతలో పళని స్వామి నెగ్గాడు! కర్ణాటక జైల్లో కూర్చున్న డాన్ శశికళ కూడా నెగ్గింది! చినిగిన చొక్కాతో మీడియాకి దర్శనం ఇచ్చిన స్టాలిన్ కూడా తాను ఆశించిన విధంగా నెగ్గాడనే చెప్పాలి! మధ్యలో పన్నీర్ సెల్వం బృందం కూడా సానుభూతి పొందటంలో బాగానే నెగ్గింది! మరిక ఓడింది ఎవరు? జనం! అవును... వాళ్లు జయలలిత ముఖం చూసి ఓటు వేశారు! అమ్మ కోసం అధికారం అప్పజెబితే ఇవాళ్ల చిన్నమ్మ మనుషులు దౌర్జన్యంగా సీఎం సీటు కబ్జా చేశారు! కాని, విషాదం ఏంటంటే... ప్రజాస్వామ్యం అంటే ఇదే! మరో నాలుగేళ్ల దాకా ఇంకేం లేదు...

 

పన్నీర్ ముందు ముందు చేయబోయే పోరాటం ఫలించిగాని... స్టాలిన్ వేసే ఎత్తులు వర్కవుట్ అయ్యిగాని... మధ్యంతర ఎన్నికలు వస్తే.. అప్పుడు జనం తమ అభిప్రాయాన్ని ఓట్లు రూపంలో చెప్పవచ్చు. అలా ఏం కాకపోతే మాత్రం తమిళనాడు ప్రజలకి ఇష్టం వున్నా లేకున్నా పళని స్వామిని , ఆయన నెత్తిన కూర్చుని పరిపాలించే జేజేమ్మ శశికళని భరించాల్సిందే! అసెంబ్లీలో బలపరీక్ష తరువాత చెన్నైలో ఇదీ పరిస్థితి!

 

అసెంబ్లీ మొత్తం స్పీకర్ ఆధీనంలో వుంటుంది. అందుకే, స్పీకర్ నిష్పక్షపాతంగా వుండాలి. కాని, అధికార పక్షానికి చెందే ఏ స్పీకర్ కూడా తన పార్టీకి మంచి చేసుకోకుండా అపోజిషన్ కి మేలు చేస్తాడా?

 

తమిళనాడు అసెంబ్లీలో కూడా అదే జరిగింది. ఆయన ఆడియో, వీడియో రికార్డింగ్స్ లేకుండా సీక్రెట్ బ్యాలెట్ పెట్టకుండా బల పరీక్ష అన్నాడు. అంటే, బల్లలు చరచటం, చేతులు పైకెత్తటం లాంటి వాటితో ఓటింగ్ జరిపేస్తారన్నమాట! అలా చేస్తే ఇక పళని స్వామి గెలుపు ఎలాగూ అనివార్యమే! అందుకే, పన్నీర్ కి మద్దతుగా నిలిచిన డీఎంకే బ్యాచ్ రెచ్చిపోయింది. ఏకంగా స్పీకర్ ని పక్కకు తోసి ఆ సీట్లో ఓ డీఎంకే ఎమ్మెల్యే కూర్చున్నాడు కూడా! ఇదంతా చూసి మనం షాకవుదామా అంటే... అంత శ్రమ అక్కర్లేదనే చెప్పుకోవాలి! కారణం... రాజకీయాల్లో నేతల రూపంలో చెలామణి అవుతోంది రౌడీలు, గూండాలేనని మనలో ఎవరికి మాత్రం తెలియదు! చిన్న చిన్న మున్సిపల్ సమావేశాల్లో కార్పోరేటర్లు కొట్టుకోవటం మొదలు పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేల దాకా ఎక్కడ చూసినా ఇదే వ్యవహారం! తమిళనాడు అసెంబ్లీ దీనికి అతీతం కాదుగా...

 

డీఎంకే వారు స్పీకర్ ని అవమానించటం, స్టాలిన్ అనుచరుల్ని పళని స్వామి వర్గం గాయపరచటం... ఇదంతా ఒక్క రోజు డ్రామానే! అసలు సినిమా అంతా ఇక ముందు వుంటుంది. మరో రాష్ట్రంలోని జైల్లో కూర్చున్న ఒక అవినీతి ఆరోపణలతో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ... తమిళనాడు ముఖ్యమంత్రిని శాసిస్తుంది. ఆమె తాలూకూ మన్నార్ గుడి మాఫియా రాష్ట్రాన్ని ఏలుతుంది. అయినా జనం చేయగలిగింది ఏమీ లేదు! ఎందుకంటే, మన దేశ ఓటర్లు ఎన్నికలప్పుడు నాయకుడ్ని చూసి కాకుండా వారిచ్చే ఉచిత హామీల్ని విని, వాళ్ల కులం, మతం చూసుకుని ఓటు వేస్తారు! వ్యవస్థలో అక్కడ వున్న లోపమే ఇన్ని అరాచకాలకీ కారణం....