TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమ్మ భక్తుడు.. కమలం గూటికి?!

Published on: Sat Jul 30, 2022 10:39AM

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత భక్తుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పార్టీ మారనున్నారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీలో పన్నీరు సెల్వం పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా తయారైంది. అన్నా డీఎంకేలో పురుచ్చీ తలైవీ జయలలిత ఫోటోలు తప్ప ఆమె అనుయాయులకు స్థానం లేకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఆమెకు విదేయులుగా ఉన్న వారిని ఒక పథకం ప్రకారం పక్కన పెట్టేయడానికి కార్యాచరణ ఆరంభమైందని అంటున్నారు.

పార్టీని మొత్తం తన కనుసన్నలలో నడిపిన జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ఓట్ల కోసం ఆమె ఫొటో మాత్రమే అవసరంగా కనిపిస్తోందనీ, ఆమె ఆశయాలను పక్కన పెట్టేశారనీ పలువురు అంటున్నారు. ఇప్పుడు ఆమె భక్తుడు, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా అదే అంటున్నారు. అందుకే తను అన్నాడీఎంకేను వీడనున్నట్లు సంకేతాలు కూడా ఇస్తున్నారు. అన్నాడీఎంకే బహిష్కృత నేత, అమ్మ భక్తుడిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పన్నీరు సెల్వం త్వరలోనే కాషాయ గూటికి చేరనున్నారని పరిశీలకులు చెబుతున్నారు.

ఇందుకు నిదర్శనంగా కాంచీపురంలో పన్నీరు సెల్వం వర్గీయులు ఏర్పాటు చేసిన ఓ భారీ కటౌట్ లో మోడీ బొమ్మ ఉండడాన్ని చూపుతున్నారు. బీజేపీ గూటికి చేరుతున్నట్లుగా సంకేతాలివ్వడానికే ఆ హోర్డింగ్ ఏర్పాటు చేశారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆ హోర్డింగ్ ఏర్పాటు చేసిన సందర్భమేమిటంటే.. చెస్ ఒలింపియాడ్ ప్రారింభించేందుకు ప్రధాని మోడీ చెన్నై వస్తున్నందుకు. చెన్నై వస్తున్న మోడీకి ఆహ్వానం పలుకుతూ పన్నీర్ సెల్వం వర్గీయులు ఆ హోర్డింగ్ ను ఏర్పాటు చేశారు.  అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరులో   మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామిది పై చేయి కావడం, మరో మాజీ సీఎం పన్నీరు సెల్వంకు ఉద్వాసన పలకడం వంటి సంఘటలను విదితమే. ఈ నేపథ్యంలోనే పళని స్వామి కమలం గూటికి చేరనున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.