రాహుల్ గాంధీ మెడకు బాంబు చుట్టి విసిరేయాలి

 

ఎన్నికల ప్రచారంలో పలువురు నేతలు మతం, దేశభక్తి, ఉగ్రవాదం వంటి అంశాలను పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఎన్నికలకు ముందు బాలాకోట్ దాడులపై అంతర్జాతీయ మీడియా అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో విపక్ష పార్టీలు ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశాయి. అయితే అధికార పార్టీ బీజేపీ మాత్రం విపక్షాల మీద విమర్శలు గుప్పించింది. తాజాగా ఇదే అంశంపై బీజేపీ నేత, మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాల్నాలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడిన పంకజ.. బాలాకోట్ దాడులపై అనుమానం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మెడకు బాంబు చుట్టి దేశం బయటకు విసిరేయాలని అన్నారు. దేశాన్ని ఉగ్రవాదం నుంచి విముక్తి చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ ఆ విషయాన్ని కూడా ప్రశ్నిస్తోందని పంకజ ఆరోపించారు. సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించి ఆధారాలివ్వమని కాంగ్రెస్ అడగటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రచారం కోసమే కాంగ్రెస్ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారని పంకజ ముండే మండిపడ్డారు.

కాగా, రాహుల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పంకజా ముండేపై మహారాష్ట్ర కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ మెడకు బాంబు చుట్టి దేశం బయటకు విసరేయాలన్న వ్యాఖ్యలు బీజేపీ నేతల చవకబారుతనానికి నిదర్శనమని విమర్శించింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన హేమంత్ కర్కరే లాంటి అమరులను కించపరిచేలా మాట్లాడిన బీజేపీ నేతలు ఎంతకైనా దిగుజారుతారని కాంగ్రెస్ చురకలంటించింది.