పాలెం బస్సు ప్రమాద బాధితులకి న్యాయం జరిగేదెన్నడు

 

పాలెం బస్సు దుర్ఘటనలో 45మంది నిండు ప్రాణాలు మంటలకు ఆహుతయిపోయాయి. ఆప్తులను, వారి అండను కూడా పోగొట్టుకొని తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నవారి కుటుంబ సభ్యులకు అండగా నిలబడవలసిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రమాదం జరిగి రెండు నెలలు గడుస్తున్నాఇంతవరకు వారికి ఎటువంటి సహాయం, న్యాయం చేయలేదు. కనీసం వారిపట్ల సానుభూతి కూడా చూపలేకపోయింది. ఇటువంటి ఘోర దుర్ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం, రాజకీయపార్టీలు వెంటనే ‘దిగ్బ్రాంతి ప్రకటనలు’ జారీ చేయడం తప్పితే, తదనంతరం వారి గోడు పట్టించుకోవని ఈ దుర్ఘటన మరోమారు రుజువు చేస్తోంది.

 

ఆత్మీయులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నవారు ఎటువంటి సానుభూతికి నోచుకోకపోగా, న్యాయం కోరుతూ రోడ్డున పడాల్సిరావడం ఇంకా బాధాకరం. చిన్నచిన్న నేరాలకు సైతం కేసులు పెట్టి దోషులను కోర్టుల చుట్టూ తిప్పే పోలీసులు, 45మంది కళ్ళెదుట కాలి బూడిదయిపోతే ఇంతవరకు ఎటువంటి చర్యలకు ఉపక్రమించక పోవడం చూస్తే ‘చట్టం దృష్టిలో కొందరు అధిక సమానులు’ గనుకనే భాధ్యులపై చర్యలకు వెనకాడుతున్నట్లు భావించవలసి ఉంటుంది. ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని కూడా వేలాది ప్రమాద కేసులలో ఒకటిగా పరిగణిస్తూ మాట్లాడుతోంది తప్ప,మానవీయ కోణంలో ఆలోచించేందుకు ఇష్టపడటం లేదు. బహుశః ఈ ప్రమాదాన్ని ప్రత్యేకంగా పరిగణించి భాదిత కుటుంబాలకు న్యాయం చేస్తే, ఎప్పుడయినా దురదృష్టవశాత్తు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు భాదితులు ప్రభుత్వాన్నిఈవిధంగానే డిమాండ్స్ చేస్తారనే ఆలోచనతో వెనుకంజ వేస్తూ ఉండవచ్చును. అటువంటప్పుడు బస్సులో ప్రయాణించే ప్రయాణికులకి తప్పనిసరిగా ఇన్స్యూరెన్స్ చేయించాలనే నిబంధన అమలు చేస్తే, బాధిత కుటుంబాలకు కొంత మేర ఊరట లబించే అవకాశం ఉంటుంది.

 

ఇంతకాలం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొన్న ప్రభుత్వం, ఇప్పుడు భాదిత కుటుంబాలకు క్రమంగా రాజకీయ పార్టీలు కూడా వచ్చిఅండగా నిలబడుతుండటంతో కొంత కదలిక వచ్చింది. నిన్న జబ్బార్ ట్రావెల్స్ భాగస్వాములను నలుగురిని సీఐడీ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేసారు. వారిని ఈరోజు మెహబూబ్ నగర్ కోర్టులో హాజరుపరిచి కేసుపై విచారణ మొదలుపెట్టబోతున్నారు. అయితే, రెండు రాష్ట్రాలలో రెండు బస్సు యాజమాన్యాల మధ్య జరిగిన ఒప్పందాల దృష్ట్యా ఈ కేసు ఇంత త్వరగా పరిష్కరింపబడే అవకాశం లేదు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేటప్పటికి ఎన్నినెలలు, సం.లు పడతాయో కోర్టులకే ఎరుక.