పలాస పోలీసు స్టేషనా... వైసీపీ కార్యాలయమా?
Published on: Tue Oct 25, 2022 3:49PM
ఆంధ్రప్రదేశ్ లో పోలీసు స్టేషన్లు అధికార వైసీపీ కార్యాలయాలుగా మారిపోయాయా? పోలీసు స్టేషన్లలో వైసీపీ నేతల మాటే చెల్లుబాటు అవుతోందా? విపక్ష నేతలను వేధించడమే పనిగా వైసీపీ నేతల కనుసన్నలలో పోలీసు స్టేషన్లు పని చేస్తున్నాయా? అంటే ఔననే అంటున్నారు తెలుగుదేశం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తడమే తమ విధి అన్నట్లుగా పని చేస్తున్నాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస పోలీసు స్టేషన్ పూర్తిగా వైసీపీ కార్యాలయంలా మారిపోయిందంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శీరీష, పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పలాస సీఐ శంకరరావు అధికారపార్టీకి కొమ్ము కాస్తున్నారనీ, మంత్రి అప్పలరాజు చెప్పిన విధంగా ఆయన వ్యవహరిస్తున్నారనీ రామ్మోహన్ నాయుడు అన్నారు.
అప్పలరాజు కనుసన్నలలో సీఐ పని చేస్తూ... ఏకంగా పోలీసు స్టేషన్ నే వైసీపీ కార్యాలయంగా మార్చేశారని ఎంపీ ఆరోపంచారు. సీఐ శంకరరావుపై చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఎస్పీని కోరారు.


