పన్నీర్.. పళనిలు ఒకరిని ఒకరు నమ్మడం లేదా..?

ఎలాంటి బంధానికైనా నమ్మకం ప్రధానం.. అది భార్యభర్తలు కావొచ్చు, వ్యాపారంలో భాగస్వాములు కావొచ్చు.. స్నేహితులు కావొచ్చు.. అన్నాదమ్ములు కావొచ్చు.. ఇలా ఎలాంటి రిలేషనైనా నమ్మకం అనే అనే పునాదులపైనే అది నిలబడుతుంది. తమిళనాడుతో పాటు దేశ రాజకీయాల్లో నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పన్నీర్ సెల్వం అని ఎవరిని అడిగినా చెబుతారు. దివంగత ముఖ్యమంత్రి జయ నమ్మిన బంటుగా ఎన్నో సంక్షోభాల్లో ఆమెను కాపాడారు. తానే ముఖ్యమంత్రి అయినప్పటికీ అమ్మ కూర్చీలో కూర్చోకుండా ఆమె ఫోటోను అక్కడ ఉంచి తన స్వామి భక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు.

 

అలాంటి పన్నీర్ సెల్వంపై ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామికి నమ్మకం సన్నగిల్లుతుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గతేడాది డిసెంబర్‌లో జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో పొడచూపిన విభేదాలు, వివాదాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అమ్మ తర్వాత చిన్నమ్మకే పన్నీర్‌ సీఎం పీఠాన్ని అప్పగిస్తారని అంతా అనుకొన్నారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, అనంతరం అమ్మ సమాధి సాక్షిగా దీక్షకు దిగడం, శశికళపై తిరుగుబాటు చేయడం చకచకా జరిగిపోయాయి.

 

దీంతో శశికళ వర్గం ఖంగుతింది. అప్పటి నుంచి తమిళనాట రాజకీయాల్లో అనేక కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లడం, పళనిస్వామి సీఎం కావడం.. పన్నీర్ సెల్వంతో ఏకమవడం.. అదే సమయంలో దినకరన్ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేయడం ఇలా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎప్పటికీ కలవరని అనుకొన్న పన్నీర్ - పళని వర్గాలు ఒకటయ్యాయని ఆనందపడిన పార్టీ శ్రేణులకు ఆ సంతోషం ఎక్కువ రోజులు మిగలేలా కనిపించడం లేదు. దీనింతటికి కారణం పన్నీర్ సెల్వం ఢిల్లీ వెళ్లడమే. పన్నీర్ వెంట రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి తంగమణిని సీఎం పళనిస్వామి ఢిల్లీకి పంపారు.

 

ప్రధానితో సమావేశానికి మైత్రేయన్‌ను మాత్రమే తీసుకెళ్లిన పన్నీర్ .. తంగమణిని బయటే వదిలేశారని.. రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్‌కు వ్యతిరేకంగా మోడీకి పలు విషయాలు చెప్పారని.. తంగమణి సహా ఇతర నాయకులు పళనిస్వామి చెవిలో ఊదినట్లు చెన్నై టాక్. దీనికి బలాన్ని చేకూర్చేలా.. రాష్ట్రానికి కేంద్ర బృందం వస్తుందని ప్రకటన రావడం, ఆర్కేనగర్ ఉప ఎన్నిక నిర్వహిస్తామని ఈసీ ప్రకటించడం జరిగిపోయాయి. ఈ పరిణామాలన్నింటిని ఒక కంట కనిపెడుతున్న సీఎం పళనిస్వామి ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై నిఘా పెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మెరీనా బీచ్‌లోని అమ్మ సమాధిని వేదికగా చేసుకొని పన్నీర్ మరోసారి ధర్మయుద్ధానికి దిగుతారన్న అనుమానాలను వారు వ్యక్తం చేశారు.