TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తప్పలేదు పాపం.. నూర్ వైమానిక స్థావరంపై భారత్ దాడి నిజమే.. పాక్ ప్రధాని ఒప్పుకోలు

Published on: Sat May 17, 2025 10:52AM

బుకాయించడానికి, బొంకడానికి పాక్ కు ఇక ఏ అవకాశమూ లేకుండా పోయింది. అందుకే పాకిస్థాన్ ప్రధాని  షహబాజ్ షరీఫ్ ఎలాంటి శషబిషలకూ తావులేకుండా, తటపటాయించకుండా భారత్ పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై దాడులు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించేశారు. అత్యంత కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ క్షిపణి దాడులకు చేసిందని బాహాటంగా ఒప్పేసుసున్నారు.  అంతే కాదు అన్ని విధాలుగా అసహాయంగా మిగిలిపోవడం వల్లనే భారత్ కాళ్లా వేళ్లా పడి  కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చామని కూడా బేలగా చెప్పేశారు. భారత్ ఆపరేషన్ సిందూర్  లో భాగంగా ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత.. మే 10 తెల్లవారు జామున రెండున్నర గంటలకు పాకిస్థాన్ వైమానిక స్థావరంపై మిస్సైల్ స్ట్రైక్ జరిగిందనీ, ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ స్వయంగా తనకు ఫోన్ చేసి చెప్పారని పాకిస్థాన్ ప్రధాని వెల్లడించారు.  ఇదే పాక్ ప్రధాని నిన్న మొన్నటి వరకూ భారత్ ఆపరేషన్ సిందూర్ అట్టర్ ప్లాప్ అనీ, ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలకు కారణమైన ఆ ఆపరేషన్ ను విజయవంతంగా ఫెయిల్ చేశామనీ, భారత్ పై పాకిస్థాన్ విజయం సాధించిందనీ చెప్పుకుంటూ వచ్చారు.

ఇదే విషయాన్ని పాకిస్థాన్ పార్లమెంటులో కూడా ప్రకటించారు. అయితే అవన్నీ బుకాయింపులేనని అంగీకరిస్తూ ఇప్పుడు వాస్తవాన్ని ప్రకటించారు. భారత్ కచ్చితత్వంతో దాడులకు పాల్పడిందనీ, ఆ దాడులలో నూర్ ఖాన్ వైమానిక స్థావరం ధ్వంసమైందనీ అంగీకరించేశారు. అయితే  దాడుల కారణంగా వాటిల్లిన నష్టం వివరాలను ఇప్పటికీ దాచిపెడుతున్న ఆయన భారత్ తో యుద్ధాలు గెలవలేమని పరోక్షంగా అంగీకరిస్తూ.. ఇక చర్చలు మార్గమని తేల్చేశారు.  వాస్తవానికి  భారత్ దాడులలో పాకిస్థాన్ లోని అన్ని వైమానిక స్థావరాలు, రాడార్లు, ఆర్మీ కంటోన్మెంట్ లు ధ్వంసమైనట్లు సమాచారం ఈ దాడులలో  పాకిస్తాన్ సైనికులతో పాటు, టర్కీ సైనికులు కూడా మృతి చెందారు.