పాకిస్తాన్ ఇకనయినా మారుతుందా లేదా?

 

“హలో! స్కూల్లో ఉన్న పిల్లలందరినీ చంపేశాము..ఇప్పుడేమి చేయాలి మేము?”

 

“ఆర్మీ వాళ్ళు వచ్చేవరకు ఆగండి. వచ్చేక వారిని కూడా వీలయినంత మందిని చంపండి. ఆ తరువాత మిమ్మల్ని మీరు పేల్చేసుకొని చచ్చిపొండి..ఓవర్!”

 

ఇవి పెషావర్ ఆర్మీ స్కూల్లో పిల్లలను పొట్టనబెట్టుకొన్న తరువాత మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులలో ఒకరు తమ నాయకుడితో సాగించిన చివరి సంభాషణలు. వారి ఈ ఫోన్ సంభాషణలను పాకిస్తాన్ ఇంటలిజన్స్ వర్గాలు ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ కు అందజేసిందని స్థానిక పత్రికల ద్వారా బహిర్గతం అయ్యింది. అయితే ఇంత ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదుల సంభాషణలను రహస్యంగా వినగలిగిన పాకిస్తాన్ ఇంటలిజన్స్ వర్గాలు, అదే పని ముందే చేయగలిగి ఉండి ఉంటే అంతమంది పిల్లలు ప్రాణాలు కోల్పోయేవారు కారు కదా అని ఎవరికయినా అనిపించకమానదు. ఇంటలిజన్స్ వైఫల్యం ఎంతటి దారుణాలకు దారి తీస్తుందో ఈ సంఘటన తెలియజేస్తోంది.

 

ఒకవైపు పాకిస్తాన్, యావత్ ప్రపంచమూ కూడా ఈ దారుణ సంఘటనకు తీవ్రంగా కలత చెంది ఉండగా, పాకిస్తాన్ దేశంలో బిడ్డలను పోగొట్టుకొన్న తల్లులు వారి శవ పేటికల మీదపడి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే, తాలిబాన్ ఉగ్రవాదులు వారినందరినీ పరిహసిస్తున్నట్లుగా ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ఉగ్రవాదుల ఫోటోలను మీడియాకు విడుదల చేసారు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు అందరూ తుపాకులు చేతబట్టుకొని ఏదో యుద్దానికి బయలుదేరుతున్నట్లుగా ఫోటోకు ఫోజులీయడం చూస్తే వారి హృదయాలు ఎంతగా మొద్దు బారిపోయాయో అర్ధమవుతుంది.

 

ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీజేపీ శాసనసభ్యుడు ఒకరు మాట్లాడుతూ ఆ స్కూలు గదుల్లో అత్యంత క్రూర మృగాన్ని వదిలిపెట్టినా బహుశః ఇంతమందిని అది పొట్టన బెట్టుకొని ఉండదు. కానీ మనిషి రూపంలో వచ్చిన ఈ తాలిబాన్ మృగాలు ఏకంగా 148మందిని పొట్టన బెట్టుకొన్నాయి. ఇటువంటి మృగాలకు ఈ భూమి మీద ఉండే అర్హత కూడా లేదు’ అని ఎంతో ఆవేదనతో పలికారు. ఆయన మాటలు అక్షర సత్యాలని అందరూ అంగీకరిస్తారు. ఎందుకంటే ఎంతటి క్రూర మృగమయినా తన ఆకలి తీర్చుకొనేందుకు మాత్రమే వేటాడుతుంది. ఆ తరువాత తన కంటి ముందే తను వేటాడే జంతువులు తిరుగుతున్నా వాటి జోలికి వెళ్ళదు. కానీ పైశాచిక ఆనందానికి అలవాటుపడిన ఇటువంటి ఉగ్రవాదులు మతానికి వక్రబాష్యాలు చెప్పి మతం పేరుతో ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు.

 

అసలు ఏ మతం చెప్పింది అభం శుభం తెలియని చిన్నారులను చంపడం తప్పు కాదని? ఏమతం చెప్పింది గర్భిణి స్త్రీలను కాల్చి చంపడం తప్పు కాదని? ఏ మతం సమర్ధిస్తుంది ఇతరుల భార్యలను, అక్క చెల్లెళ్ళను, పిల్లలను చెరచి చంపడాన్ని? ఇది మతోన్మాధం కూడా కాదు. మతం పేరు చెప్పుకొని మానవ రూపంలో తిరుగుతున్న మృగాలు ఆడే పైశాచిక క్రీడ.

 

అటువంటి వారిని పెంచి పోషించినందుకు పాకిస్తాన్ చాలా భారీ మూల్యం చెల్లించింది. ముఖ్యంగా పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ప్రభుత్వాలు, సైనికాధికారులు, ఐ.యస్.ఐ. సంస్థ అధికారులు, రాజకీయ నేతలకు ఈ సంఘటన కనువిప్పు కలిగించి వారిలో పరివర్తన తీసుకురావాలని అందరూ ప్రార్ధించాలి. వారు పెంచి పోషించిన విషసర్పాలు చివరికి వారి పిల్లలనే కాటు వేసాయి. కనుక ఈసారి తప్పక వారిలో పరివర్తన కలుగుతుందని యావత్ ప్రపంచం ఆశిస్తోంది.

 

కానీ సరిగ్గా ఇదే సమయంలో ముంబై 26/11దాడులలో ప్రధాన సూత్రధారి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది జాకీ ఉర్ రెహ్మాన్ లక్వీకి పాకిస్తాన్ కోర్టు సరయిన సాక్ష్యాలు లేవని చెపుతూ బెయిలు మంజూరు చేయడం అందరినీ దిగ్బ్రాంతికి గురిచేసింది. అదే సమయంలో కాశ్మీర్ సరిహద్దులలో పూంచ్ సెక్టర్ వద్ద పాక్ ఉగ్రవాదులు షరా మామూలే అన్నట్లు భారత్ లోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నంలో భారత సైనికులమీద కాల్పులు జరిపారు. ఇవన్నీ చూస్తుంటే అసలు పాకిస్తాన్ ప్రభుత్వం ఎప్పటికయినా మారుతుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మారకపోతే ఇటువంటి నరమేధాలు మరిన్ని చూడక తప్పదు. మరెందరో తల్లుల, స్త్రీల ఉసురు పోసుకోక తప్పదు.