TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మళ్లీ కవ్వింపులకు దిగుతున్న పాక్.. భారత్ తో యుద్దానికైనా సై అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

Published on: Mon Jun 22, 2026 10:07AM

దేశంలో అంతర్గత కలహాలు, ఆర్థిక సంక్షోభం పీక్స్ కు చేరడంతో పాకిస్థాన్ దిక్కు తోచని పరిస్థితిలో పడింది. ఈ సమస్యల నుంచి, సంక్షోభాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది.  దేశంలో సంక్షోభాలు తీవ్ర స్థాయికి చేరిన ప్రతి సారీ పాకిస్థాన్ కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి పబ్బం గడుపుకునేది.

అయితే ఈ సారి ఆ పప్పులు కూడా ఉడకకపోవడంతో..  సింధు జలాల వివాదాన్ని శరణు జొచ్చింది.  సింధు జలాల  వివాదాన్ని రాజకీయం చేస్తూ  యుద్ధ నాటకానికి తెరలేపింది. సింధు నదీ జలాల విషయంలో తమ దేశ ప్రయోజనాలకు, నీటి ప్రవాహానికి ఏమాత్రం ముప్పు వాటిల్లుతోందని భావించినా భారత్‌తో యుద్ధానికైనా వెనుకాడబోమని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్  అన్నారు.  నీటి హక్కులు తమ జాతీయ భద్రతలో ఒక భాగమని, అవసరమైతే సైనిక చర్యకు దిగే అవకాశాన్ని తాము కొట్టిపారేయలేమని చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

 పాకిస్థాన్‌ మీడియా సంస్థ ఏఆర్‌వై న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  చేసిన ఈ వ్యాఖ్యలను ఎవరూ  సీరియస్ గా తీసుకోవడం లేదు.  అంతర్గత సమస్యల నుంచి   ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగమే యుద్ధ వ్యాఖ్లు అంటూ అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే వరకు దాయాది దేశంతో ఎటువంటి చర్చలు ఉండవన్న ఇండియా వైఖరి స్పష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ రక్షణ మంత్రి నుంచి యుద్ధం మాట రావడం అంతిమంగా ఆదేశానికే నష్టం చేకూరుస్తుందని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.  

  ఇటీవల భారత జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్  అంతర్జాతీయ ఒప్పందాల పరిధిలోనే ఉంటూ, భారత భూభాగంలో లభించే జల వనరులను మరియు దేశానికి చట్టబద్ధంగా దక్కాల్సిన నీటి హక్కులను పూర్తిగా వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తామని స్పష్టంగా చెప్పారు.    ఈ నేపథ్యంలోనే పాక్ రక్షణ మంత్రి భారత్ తో యుద్ధానికైనా సరే అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వం  ఉగ్రవాదంపై వైఖరిని మార్చుకోకుండా..  ఇలాంటి కవ్వింపు చర్యలకు దిగితే  మరోసారి భంగపాటుకు గురికాక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.