కాశ్మీరీలంతా పాక్ ప్రజలే.., దానికి జిహాద్ ఒక్కటే మార్గం: పాక్ అధ్యక్షుడి పైత్యం

 

 

కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఏకాకిగా మారినా కూడా ఆ దేశ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు మాత్రం మానలేదు. తాజాగా ఈ రోజు పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా మాట్లాడుతూ "భారత్‌ను ఎదుర్కోవాలంటే జిహాద్ ఒక్కటే మార్గమని" పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఒక దేశ అధ్యక్ష పదవిలో ఉంటూ ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం తీవ్రంగా దుమారం రేపుతోంది. భారత్ ఆర్టికల్ 370 ఉపసంహరించినప్పటి నుండి పాక్ దిక్కుతోచని  స్థితిలోకి చేరింది. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి  ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరిచేలా వ్యవహరించాల్సింది పోయి ఇలా మరింత రెచ్చగొట్టే ధోరణి అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

 పాక్ తన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను "కశ్మీర్ సంఘీభావ దినం" గా జరుపుకుంది. పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగిస్తూ, పాకిస్థాన్  కశ్మీర్ ప్రజలకు అండగా ఉందని, ఇకపై కూడా అండగానే ఉంటుందని చెప్పారు. "కశ్మీరీలంతా పాక్ ప్రజలేనని... వారి బాధలు తమ బాధలేనని" అయన అన్నారు.