TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పరువూ పాయె.. సోమ్ములూ పాయె.. చాంపియన్స్ ట్రోఫీ ఆతిధ్యదేశం పాక్ డకౌట్

Published on: Fri Mar 7, 2025 1:45PM

దాదాపు 29 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఎట్టకేలకు పాకిస్థాన్ ఒక ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. ఏ విధంగా చూసినా ఇది పాకిస్థాన్ క్రికెట్ కు ఒక పెద్ద బూస్ట్ అవ్వాలి కానీ అందుకు భిన్నంగా పాక్ ఈ టోర్నీ నిర్వహణ ద్వారా సొమ్ములూ పోగొట్టుకుంది. పరువూ పోగొట్టుకుంది.

పాకిస్థాన్ లో శాంతి భద్రతలకు సంబంధించి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటామని ఆ దేశం హామీ ఇచ్చింది. అయితే పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సంబంధాలు లేని కారణంగా టీమ్ ఇండియా పాక్ వేదికగా ఈ టోర్నీలో మ్యాచ్ లు ఆడటానికి నిరాకరించింది. దీంతో గత్యంతరం లేక భారత్ ఆడే మ్యాచ్ లను తటస్థ వేదికలో నిర్వహించడానికి పాకిస్థాన్ అంగీకరించింది. దీంతో ఈ టోర్నీలో భారత్ అడే మ్యాచ్ లకు దుబాయ్ వేదిక అయ్యింది. 

ఎట్టకేలకు సుదీర్ఘ విరామం తరువాత పాకిస్థాన్ ఒక అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ అవకాశం దక్కించుకోవడంతదో ఆ దేశంలో క్రికెట్ పునరుజ్జీవానికి మార్గం సుగమమైందనే అంతా భావించారు. అయితే పాకిస్థాన్ ప్రదర్శన, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రాజకీయాలు టోర్నీ నిర్వహణను అస్తవ్యస్థం చేసి పారేశాయి. 

  ఉగ్ర దాడులు, అశాంతి, రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్న పాకిస్థాన్ లో టోర్నీ నిర్వహణ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి కత్తిమీద సామే అయినప్పటికీ, ఆ బోర్డు సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి కూడా ఒక అవకాశం లభించిందనే చెప్పుకోవాలి. అయితే ఈ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఘోరంగా విఫలమైంది. జట్టు ఎంపిక నుంచీ కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రాజకీయం చేసింది. దీంతో పాక్ క్రికెటర్లలో ఆత్మ విశ్వాసం పాతాళ స్థాయికి పడిపోయింది. ఫలితం ఆ జట్టు కనీసం నాకౌట్ కు కూడా చేరుకోకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. స్వదేశంలో నిర్వహించిన ట్రోఫీలో ఆ జట్టు కనీసం ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేక చతికిల బడింది.

తొలి మ్యాచ్ స్వదేశంలో న్యూజిలాండ్ మీద ఆడిన పాకిస్థాన్ పరాజయాన్ని మూటగట్టుకుంది.  ఆ తరువాత తన రెండో మ్యాచ్ దాయాదిదేశం భారత్ తో ఆడింది. ఈ మ్యాచ్ తటస్థ వేదిక అయిన దుబాయ్ లో జరిగింది. ఆ మ్యాచ్ లో పాకిస్థాన్ పేలవ ఆటతీరుతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక స్వదేశంలో పాకిస్థాన్ ఆడాల్సిన మూడో మ్యాచ్ వర్షార్పణమైంది. అంతే టోర్నీలో పాకిస్థాన్ కథ ముగిసింది. అన్నిటి కంటే దయనీయమైన విషయం ఏమిటంటే.. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ నిర్వహించే అవకాశం లేకుండా భారత్ ఫైనల్స్ కు చేరింది. దీంతో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దుబాయ్ లో జరగనుంది. 

ఇక పీసీబీ ఈ టోర్నీ నిర్వహిస్తే బోలెడు ఆదాయం వస్తుందని భావించింది. భారత్ మ్యాచ్ లు దుబాయ్ లో జరగడంతో  సగం ఆశలు గల్లంతయ్యాయి. ఇక పాకిస్థాన్ కనీసం నాకౌట్ కు కూడా చేరకుండా టోర్నీ నుంచి నిష్క్రమించడంతో స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన రెండో సెమీ ఫైనల్ కు ప్రేక్షకులే లేకుండా పోయారు. దీంతో ఈ టోర్నీ నిర్వహణ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఖర్చే తప్ప ఆదాయం లేకుండా పోయింది. టోర్నీ నిర్వహణ కోసం స్టేడియంల మరమ్మతులు, ఏర్పాట్ల కోసం కనీసం 1280 కోట్లకు పైగా పీసీబీ వ్యయం చేసింది. అయితే  ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. పాకిస్థాన్ లో జరగాల్సిన రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దు కావడం, పాకిస్థాన్ నాకౌట్ కు కూడా చేరుకోకపోవడంతో పాక్ లో జరిగిన మ్యాచ్ లన్నీ ప్రేక్షకులు లేక వెలవెల బోయాయి.

ఇక అడ్వర్టైజ్ మెంట్ల ద్వారా బోలెడు ఆదాయం వస్తుందని ఆశించిన పీసీపీకి పాక్ జట్టు టోర్నీ నుంచి తొలి దశలోనే నిష్క్రమించడంతో ఆ ఆశలూ గల్లంతయ్యాయి. వెరసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో పీసీబీ మరింతగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో పాకిస్థాన్ పరిస్థితి తొలి బంతికే డకౌట్ అయిన చందంగా మారింది, పీసీబీ మాత్రం ఈ టోర్నీ నిర్వహించి సోమ్ములు, పరువూ రెండూ పోగొట్టుకుంది.