విజ‌య సార‌ధి ఇమ్రాన్

పొరుగుదేశం పాకిస్తాన్‌లో ఎన్నికల పర్వం ముగిసింది. ఎవరూ ఊహించనంతగా మాజీ క్రికెటర్, స్పీడ్ స్టార్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్  ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. యావత్ ప్రపంచానికి దిగ్బ్రాంతి కలిగించే విధంగా అక్కడి ఎన్నికలు జరిగాయి.  ప్రపంచవ్యాప్తంగా  అన్ని దేశాలు ఈ ఎన్నికలను నిశితంగా పరిశీలించాయి. ఇమ్రాన్‌ఖాన్‌పై పాక్ ప్రజలకు ఆరాధన, ఆయన్ని గెలిపించాలని ఉన్నా.. ఈ ఎన్నికల ప్రక్రియలో సైన్యం పాత్ర చాలా ఎక్కువగా ఉంది. వారే దగ్గరుండి ఈ ఎన్నికలను నిర్వహించి ఇమ్రాన్‌ఖాన్ విజయం సాధించేలా చేసాయని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఇది ఎంత వరకూ నిజమో తేలాలంటే కొన్నాళ‌్లు వేచి చూడాల్సిందే. మరోవైపు మైదానాల్లోనే తమ ఆరాధ్య క్రీడాకారులకు ప్రేక్షకులు నీరాజనాలు పలకరని, వారిని తమ పాలకులుగా కూడా చేసుకోవడానికి వెనుకాడరని పాకిస్తాన్ ఎన్నికలు రుజువు చేశాయి.

 

 

క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ గెలుపుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులకు ఓ సందేశం అందింది. అది మైదానంలో తమను దేవుళ్లుగా చూసే అభిమానులు తమ నుంచి కేవలం ఆటలో గొప్పతనాన్నీ, అద్భుత ప్రదర్శనను మాత్రమే ఆశించడం లేదని చాటి చెప్పారు పాకిస్తాన్ ప్రజలు. పాకిస్తాన్ ఎన్నికలు ఆటలు, ప్రజలకూ మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. విజయమంటే అలా అలవోకగా తెచ్చుకునేది కాదని, లేదూ ప్రత్యర్ధుల బలహీనతల నుంచి వచ్చేది కాదని ఇమ్రాన్ ఖాన్ తన విజయంతో నిరూపించారు. ఈ గెలుపు కోసం ఇమ్రాన్ ఖాన్ చాలా కష్టపడ్డారు. ఎంతో శ్రమించారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. వాటన్నిటింకీ సమాధానమే ఈ విజయం అని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల‌్డ్ స్మిత్ ట్విట్ చేసిందంటే ఇమ్రాన్ ఖాన్ ఎంత కష్టపడ్డారో అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఈ శ్రమంతా అక్కడి సైన్యం, ఐఎస్ఐ వంటి ఉగ్రవాదుల జోక్యంతో నీరుగారిపోయింది. పాకిస్తాన్ ఎన్నికల్లో 272 స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఇమ్రాన్ ఖాన్‌కు అధికారానికి కావాల్సిన అన్ని స్ధానాలు దక్కాయి. ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధికార పగ్గాలు అందుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ 137 స్ధానాలకు దగ్గర దగ్గరగా ఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కావడం ఖాయం. 

 

 

ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటున్నారు అధికారులు. నిత్యం అలజడులతో, ఆందోళనలతో, సైనిక చర్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్‌కు కావాల్సింది ప్రశాంతత. ఇది కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎలా తీసుకు వస్తారనేది అందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న. పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా చూపిస్తున్న కొన్ని దేశాలకు ఇమ్రాన్‌ఖాన్ ఎలా సమాధానం చెప్తారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇమ్రాన్‌ఖాన్ కూడా ఎన్నికలకు ముందు దేశ సైన్యానికి దగ్గర అని, మరోవైపు ఉగ్రవాద సంస్ధలకు కూడా దగ్గరని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొన్నిసార్లు ఇమ్రాన్‌ఖాన్ ఉగ్రవాద సంస్ధలకు అనుకూలంగా మాట్లాడిన సందర్భాలూ ఉన్నాయి. ఇవన్నీ ఇమ్రాన్‌ఖాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు కొత్త కష్టాలు తీసుకురాక తప్పదు. ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపులోనే సైన్యం కీలకంగా వ్యవహరించడంతో అక్కడి ప్రజాస్వామ్యంపై అనుమానపు నీలినీడలు వస్తున్నాయి. ప్రధానమంత్రిగా ఇమ్రాన్‌ఖాన్ తీసుకునే ప్రతి నిర్ణయంపైనా పాకిస్తాన్‌లోనే కాదు ప్రపంచ దేశాలన్నింటిలోనూ చర్చను రేపుతాయి. ముఖ్యంగా భారతదేశంతో ఆయన అనుసరించే వైఖరిపై ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తాయి.

 

 

అధికారంలోకి రావడానికి ముందూ... వచ్చిన తర్వాత మరో విధంగానూ దేశం ఉంటుందని ఇమ్రాన్‌ఖాన్‌కు త్వరలోనే అర్ధం అవుతుంది. ఓ క్రికెట్ క్రీడాకారునిగా, ఫాస్ట్ బౌలర్‌గా బౌన్సర్లు, షార్ట్ పిచ్ బంతులతో మైదానంలో  బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బందుల పాలు చేసిన ఇమ్రాన్ ఖాన్ ఇక ముందు ప్రతిపక్షాలు, పొరుగు దేశాల నుంచి వచ్చే బౌన్సర్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా పాక్ సైనికులు, అక్కడ ప్రతి విషయంలోనూ కలుగుజేసుకునే ఉగ్రవాదసంస్ధలతోనూ ఎలా వేగుతారో వేచి చూడాలి. ఇమ్రాన్‌ఖాన్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఎదుర్కొనే ప్రధాన సమస్య భారత్. అది కూడా
కాశ్మీర్‌పై ఇమ్రాన్‌ఖాన్ వైఖరి ఎలా ఉంటుందనేది ప్రధాన ప్రశ్న. తొలి నుంచి ఇమ్రాన్‌ఖాన్‌కు భారత్ పట్ల అంత మంచి అభిప్రాయం లేదని ఇరు దేశాలకు చెందిన రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇమ్రాన్‌ఖాన్ మాత్రం భారత్ పట్ల తాను సానుకూలంగానే వ్యవహరిస్తానని,కాశ్మీర్ సమస్యను సానుకూలంగానే పరిష్కారం అయ్యేందుకు ప్రయత్నిస్తానని ప్రకటించారు. అంతే కాదు.... పేదరిక నిర్మూలనకు తనకు చైనా ఆదర్శమని కూడా ప్రకటించారు.

 

 

ఇది శుభపరిణామం. భారత్‌తో తాను క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాను అని కాకుండా ఇరు దేశాలకు చెందిన కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన అంశంగా చూస్తే బాగుంటుందని సర్వత్రా వినిపిస్తోంది. భారతదేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పదవీ కాలం మరో ఏడాదే ఉంది. ఈ లోగా పెద్దగా ఏమీ జరగకపోవచ్చు కాని... ఆ తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారు... వారితో పాకిస్తాన్ వైఖరి ఎలా ఉంటుందన్నదే ఇక్కడ ముఖ్యం. కొత్త ప్రభుత్వంపై ఇప్పటికిప్పుడు వ్యాఖ్యానాలు చేయడం కాని, ప్రకటనలు చేయడం కాని సమంజసం కాదు. క్రీడాకారునిగా ఎంతో పరిణితితో వ్యవహరించి క్రికెట్‌లో ఆ దేశానికి వరల్డ్ కప్ తీసుకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్ తన పాలనతో కూడా ప్రపంచవ్యాప్తంగా అందరి మనసులను దోచుకుంటాడని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ ఇమ్రాన్.