TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మేం లాహోర్‌లో అడుగుపెట్టాం... ఉగ్రవాదుల ప్రకటన

Published on: Mon Mar 28, 2016 10:34AM

 

అభంశుభం తెలియని చిన్నారుల మీద కసి తీర్చుకోవాలని ఎవరికి అనిపిస్తుంది. ఎవరో కూడా తెలియని పసి జీవితాలని చిదిమేయాలని ఎంతటి రాక్షసుడికైనా మనసెలా వస్తుంది. కానీ లాహోర్‌లో అదే జరిగింది. పిల్లల కేరింతలతో నిండిన ఓ పార్కులో, తాలిబాన్ చెందిన ఓ తీవ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో కనీసం 60 మందన్నా చనిపోయి ఉంటారని ప్రభుత్వ అధికారుల అంచనా. కాగా ఈ దాడులకు తామే కారణం అంటూ తాలిబాన్‌ అనుబంధ సంస్థ అయిన జమాన్‌-ఉల్‌-అహ్రార్‌ ప్రకటించింది. ఈస్టర్‌ పండుగ, అందునా ఆదివారం కావడంతో పార్కులోకి చేరిన వందలాది క్రిస్టియన్లని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది.

 

‘మేం ఈ దాడి ద్వారా నవాజ్‌ షరీఫ్‌కు ఓ సందేశాన్ని పంపిస్తున్నాం. మేం లాహోరులో అడుగుపెట్టాం! ఇక మమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. మా ఆత్మాహుతి దళాలు ఇలాంటి దాడులకు పాల్పడుతూనే ఉంటాయి’ అంటూ జమాన్‌-ఉల్-అహ్రార్‌ ప్రతినిధి ప్రకటించారు. నవాజ్ షరీఫ్‌ సొంత ఊరు అయిన లాహోర్‌ను, పాకిస్తాన్‌లోనే అతి ప్రశాంతమైన నగరాలలో ఒకటిగా పేర్కొంటారు. అలాంటి కీలకస్థానంలో దాడి చేయడాన్ని ఉగ్రవాదులు తమ విజయంగా భావిస్తున్నారు. మరి ఉగ్రవాదులు విసిరిన సవాలుని, పాకిస్తాన్‌ ప్రభుత్వం ఎలా స్వీకరిస్తుందో!