TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాకిస్థాన్ సంచలన విజయం.. ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ కైవసం!

Published on: Fri Jun 5, 2026 10:33AM

లాహోర్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్ లో క్రికెట్ ప్రపంచం ఒక అద్భుతమైన పోరాటాన్ని చూసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ లో-స్కోరింగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు 4 వికెట్ల తేడాతో పర్యాటక ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాకిస్థాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాపై పాకిస్థాన్‌కు ఇది వరుసగా మూడో వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. మ్యాచ్ ప్రారంభానికి ముందే కురిసిన చిన్నపాటి వర్షం ఆటను కొద్దిసేపు ఆలస్యం చేసింది. వాతావరణం చల్లబడ్డా పిచ్ మాత్రం స్పిన్నర్లకు అనుకూలంగా మారింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ వారి నిర్ణయం తప్పని పాక్ బౌలర్లు నిరూపించారు. పాకిస్థాన్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ కట్టెకాల్చినట్లు కుప్పకూలింది.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో కేవలం ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. అతను 71 బంతులు ఎదుర్కొని 65 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించే ప్రయత్నం చేశాడు. కంగారూల జట్టులో ఇంగ్లిస్ మినహా మరెవ్వరూ కూడా కనీసం 20 పరుగుల మార్క్‌ను కూడా దాటలేకపోయారు. ఓపెనర్ మ్యాట్ షార్ట్ ఇన్నింగ్స్ రెండో బంతికే డకౌట్‌గా వెనుతిరగడంతో ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగిలింది. ఆ తర్వాత ఇంగ్లిస్, అలెక్స్ కేరీ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తూ 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో అలెక్స్ కేరీ అవుట్ కావడంతోనే ఆస్ట్రేలియా పతనం వేగవంతమైంది. స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది వరుసగా కీలక వికెట్లు పడగొట్టగా, అబ్రార్ అహ్మద్ మరియు షాదాబ్ ఖాన్ తమ స్పిన్ మాయాజాలంతో ఆస్ట్రేలియాను కోలుకోకుండా చేశారు. ఒక దశలో 119 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి నిలకడగా కనిపించిన ఆస్ట్రేలియా, కేవలం 157 పరుగులకే పూర్తిగా ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3 వికెట్లు తీయగా, అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ చెరో రెండు వికెట్లతో రాణించారు.