భారత్ దెబ్బ.. భయంతో ఐరాసకు లేఖ రాసిన పాక్

 

పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ తీవ్ర స్థాయిలో స్పందిస్తుండడంతో పాక్ కి భయం పట్టుకుంది. పైకి.. 'పుల్వామా దాడికి మాకు సంబంధం లేదు, ఒకవేళ భారత్ మాపై దాడికి దిగితే మేం ఎదురుదాడికి సిద్దమే' అంటూ డైలాగ్ లు కొడుతున్నా లోపల మాత్రం భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా పాక్.. ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఐక్య రాజ్య సమితిని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్స్‌కి లేఖ రాశారు. ‘పాక్ పై భారత్ తన సైన్యాన్ని ప్రయోగించే అవకాశం ఉండడంతో మా ప్రాంతంలో భద్రతా పరిస్థితి క్షీణిస్తోంది. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.’ అని ఖురేషీ ఆ లేఖలో పేర్కొన్నట్టు పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది. పుల్వామాలో జరిగిన దాడి కశ్మీరీ వ్యక్తి పనేననీ.. కానీ విచారణ కూడా పూర్తి కాకుండానే పాక్ ను నిందించడంలో అర్థం లేదని ఖురేషీ పేర్కొన్నారు. దేశంలోని రాజకీయ కారణాల కోసం భారత్ కావాలని తమపై శత్రు భావాన్ని ప్రదర్శించి, ఉద్రిక్తతలు పెంచుతోందని ఆయన ఆరోపించారు.