పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ పై అజిత్ దోవల్ ఏమన్నారంటే?
Published on: Sat Aug 15, 2026 7:53AM

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి, అందుకు ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తొలి సారిగా స్పందించారు. పహల్గామ్ ఉగ్రదడి అనంతరం ప్రధాని మోడీ స్పందన, ఆయన అధికారులకు సంధించిన తొలి ప్రశ్న, ఆపరేషన్ సిందూర్ తీరును ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ ఆపరేషన్ సిందూర్ నేపథ్యంతో రూపొందించిన ఒక డాక్యుమెంటరీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారి కెమెరా ముందుకు వచ్చి వివరించారు.
పహల్గామ్ లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే తీవ్ర ఆందోళనకు గురైనఆయన తన పర్యటన ముగించుకుని భారత్‌లో ల్యాండ్ అయిన వెంటనే విమానాశ్రయంలోనే అత్యవసర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విదేశాంగ కార్యదర్శితో పాటు భద్రతా విభాగాల ఉన్నతాధికారులు ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారని, ఆలస్యం చేయకుండా అక్కడే ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. .
ఆ అత్యవసర సమావేశంలో ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలను తెలుసుకున్న అనంతరం ప్రధాని మోదీ ఆగ్రహంతో స్పందించారని దోవల్ చెప్పారు. ఈ దారుణానికి ఒడిగట్టిన సూత్రధారి ఎవరు? దీని వెనుక ఉన్న అసలు శక్తులను వెంటనే గుర్తించారా? అని ప్రధాని మొదటి ప్రశ్నగా అడిగినట్లు దోవల్ వెల్లడించారు. దాడికి పాల్పడిన వారి వివరాలు, వారి వెనుక ఉన్న సంస్థల సమాచారం వీలైనంత త్వరగా తన ముందుకు తీసుకురావాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రధాని ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలతో భారత నిఘా సంస్థలు దాడికి కారణమైన ముష్కరులను స్వల్ప సమయంలోనే గుర్తించాయన్నారు.
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలో ఉన్న బైసరన్ పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదులు పర్యాటకుల గుంపుపైకి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో స్థానిక గైడ్‌తో పాటు 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్య వెనుక లష్కరే తోయిబా, దాని అనుబంధ తీవ్రవాద ముఠా అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) హస్తం ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రాథమిక విచారణలోనే స్పష్టం చేసింది.
పౌరుల బలికి నిరసనగా, ఉగ్రవాదానికి తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు భారత సాయుధ బలగాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్యను చేపట్టి, పాకిస్థాన్ తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిధిలో ఉన్న తొమ్మిది ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులు నిర్వహించి వాటిని ధ్వంసం చేశాయి.ఆపరేషన్ సిందూర్ దేశ భద్రత విషయంలో ఇండియా జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రపంచానికి విస్పష్టంగా చాటిందని దోవల్ చెప్పారు.
Pahalgam Terror Attack, Modi Question, Ajit Doval, Operation Sindoor, Terror Camps, Jammu Kashmir


