పద్మావత్‌కు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

ఎన్నో నెలలుగా సాగుతున్న ఉత్కంఠకు.. మరికొందరు చేస్తోన్న నిరసనలకు చెక్ పడింది. ఓపెనింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న బాలీవుడ్ సినిమా పద్మావత్‌కు సర్వోన్నత న్యాయస్థానం ఊరటనిచ్చింది. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ.. శాంతిభద్రతల దృష్ట్యా రాజస్ధాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో పద్మావత్‌ను నిషేధించారు. దీంతో చిత్రనిర్మాతలు సుప్రీంను ఆశ్రయించారు.

 

పొడ్యూసర్స్ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది. దాంతో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో పద్మావత్ ఈ నెల 25న విడుదల కాబోతోంది. మధ్యయుగం నాటి రాణి పద్మావతి కథ ఆధారంగా విలక్షణ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావతి సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే వివాదంలో ఇరుక్కుంది.

 

తమ రాణి కథను వక్రీకరిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారంటూ రాజ్‌పుత్ కర్ణీసేన కార్యకర్తలు తీత్ర అభ్యంతరం తెలిపారు. పలు సందర్భాల్లో షూటింగ్‌కు సైతం ఆటంకం కలిగించడంతో పాటు భన్సాలీపై దాడికి పాల్పడ్డారు కూడా. సినిమా విడుదలైతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించడంతో సినిమా విడుదల వాయిదా పడింది. చివరికి చరిత్రకారులతో సలహా మేరకు కొన్ని మార్పులు చేసి పద్మావతిని పద్మావత్‌గా మార్చి సెన్సార్ బోర్డు రిలీజ్‌కు అనుమతినిచ్చింది. అయినప్పటికీ శాంతిభద్రతల దృష్ట్యా పలువురు ముఖ్యమంత్రులు విడుదలను నిషేధించారు. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో పద్మావత్‌ విడుదలకు ఆటంకాలన్నీ తొలగిపోయాయి.