పద్మ అవార్డుల్లో ఎన్నికల రాజకీయం

రిపబ్లిక్ డే వచ్చిందంటే చాలు పద్మ అవార్డుల హడావిడి మొదలవుతుంది. ఈ సారి ఎవరికి ఈ అవార్డులు దక్కాయోనని సగటు భారతీయుడు ఉత్కంఠగా ఎదురుచూస్తాడు. ఎంతగా ప్రతిభకు పట్టం కట్టినప్పటికీ ఎన్నో సార్లు ఈ విశిష్ట పురస్కారాల ఎంపిక విమర్శలకు దారితీసింది. ఈ సారి కూడా కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలపై విమర్శలు వస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలకు, త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకు అవార్డుల్లో పెద్దపీట వేసిందన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.

 

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఈసారి అన్యాయం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఉభయ రాష్ట్రాల నుంచి కేవలం ఒక్కరికి మాత్రమే పద్మ పురస్కారం దక్కింది. ఏపీ నుంచి కిదాంబి శ్రీకాంత్ పేరు పద్మశ్రీకి ఎంపికైంది. అది కూడా క్రీడాకారుల కోటాలో.. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాలల్లో మహారాష్ట్రకు అత్యధికంగా 11 అవార్డులు దక్కగా.. మధ్యప్రదేశ్‌కు 4, గుజరాత్‌కు 3 పద్మ అవార్డులు లభించాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు 9, తమిళనాడుకు 5, పశ్చిమబెంగాల్‌కు 5, కేరళకు 4, ఒడిషాకు 4 అవార్డులను ప్రకటించింది.

 

తెలుగు రాష్ట్రాల నుంచి పలువురి పేర్లను పద్మ అవార్డుల కోసం సిఫారసు చేయగా వారిలో ఏ ఒక్కరి పేరును కేంద్రం పరిగణలోనికి తీసుకోలేదు. ముఖ్యంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నకు.. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పేరును పద్మవిభూషణ్‌కు పంపినట్లు సమాచారం.. అలాగే పద్మవిభూషణ్ పురస్కారం కోసం చెన్నమనేని హనుమంతరావు.. నవలా రచయిత ప్రొఫెసర్ శివ్.కె.కుమార్. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పేరును.. పద్మశ్రీ కోసం ప్రజా గాయకుడు గోరటి వెంకన్న, అందెశ్రీ, చుక్కా రామయ్య, సుద్దాల అశోక్ తేజ పేర్లను తెలంగాణ ప్రభుత్వం పంపినట్లుగా తెలుస్తోంది. అయితే వీరిలో ఏ ఒక్కరిని పరిగణనలోనికి తీసుకోవడంపై పలువురు తప్పుబడుతున్నారు.

 

ఇదే అంశంపై జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్‌ కూడా స్పందించాడు. పద్మ అవార్డులు అందుకున్న వారిలో తెలుగువారు ఇంకా ఉండి ఉంటే బాగుండేదని అనిపించిందని వ్యాఖ్యానించి తెలుగువారికి పద్మ అవార్డుల విషయంలో అన్యాయం జరుగుతోందని చెప్పకనే చెప్పినట్లు. మరి బయటి నుంచి వస్తున్న ప్రశ్నలకు కేంద్రప్రభుత్వం ఏ విధంగా సర్ది చెబుతుందో వేచి చూడాలి.