వైఎస్, బాబు బాటలో జగన్.. యాత్ర సెంటిమెంట్ వర్కౌట్

 

ఆంధ్రప్రదేశ్ లో.. పాదయాత్రకి, అధికారానికి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుండి. పాదయాత్ర చేసిన నాయకులకు ఏపీ ప్రజలు పట్టం కడుతున్నారు. రాజకీయంగా చైతన్యం కలిగిన ఏపీ ప్రజలు.. ఒక నాయకుడికి ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే కులాలు, పార్టీలు, వర్గాలతో సంబంధం లేకుండా.. ఆ లీడర్ వైపు వాలిపోతారు. వారికే అధికారం కట్టబెడతారు.

ఏపీ రాజకీయాల్లో పాదయాత్ర అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు  వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ప్రజాప్రస్థానం పేరుతో 2003 ఏప్రిల్ 9న ఆయన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలు పెట్టి 1468 కిలోమీటర్ల మేర కాలినడకన రాష్ట్రమంతా తిరిగి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగించారు. ఆ పాదయాత్ర ఫలితంగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. ఆ ఎన్నికల్లో అధికార టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత 2012 అక్టోబర్ 2న ‘వస్తున్నా నీకోసం’ అంటూ చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 2340 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్లారు. దాని ఫలితంగా.. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న బాబు.. 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఏపీ ప్రజలు పాదయాత్ర చేసి ప్రజల్లో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ వైపే మొగ్గుచూపారు. 2014 ఎన్నికల్లో పరాజయాన్ని మూట గట్టుకున్న జగన్.. 2017 నవంబరు 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్రను ప్రారంభించి 3వేల కిలోమీటర్లకు పైగా నడిచారు. అసెంబ్లీకి గుడ్ బై చెప్పి ప్రజల బాట పట్టారు. టీడీపీ ప్రభుత్వ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. దాని ఫలితమే ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం. ఈ విజయంతో మిగతా ఏపీ నాయకులు ఇకపై పాదయాత్రని సెంటి మెంట్ గా తీసుకొని ప్రజల్లోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు.