42 మంది కరోనా రోగులు మిస్సింగ్

ఉత్తరప్రదేశ్‌ లోని ఘజీపూర్‌లో 42 మంది కరోనా రోగులు క‌నిపించ‌కుండా పోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. వారంతా కరోనా పరీక్షలు చేయించుకున్న స‌మ‌యంలో త‌మ ఫోన్ నంబర్లు, చిరునామాల‌ను త‌ప్పుగా ఇచ్చిన‌ట్టు అధికారులు తెలిపారు. 

దీనిపై ఘాజీపూర్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కేకే వర్మ అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ కు శుక్రవారం లేఖ రాశారు. కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన దాదాపు 42 మంది కనిపించడం లేదని వెల్లడించారు. పరీక్షల సమయంలో చాలామంది సరైన వివరాలు ఇవ్వడం లేదని, దీంతో పాజిటివ్ అని తేలిన తర్వాత వారిని గుర్తించడం కష్టమవుతోందని పేర్కొన్నారు. త‌ప్పిపోయిన వారిని గుర్తించేందుకు సాయం చేయాల్సిందిగా డాక్టర్ కేకే వర్మ కోరారు. 

త‌ప్పిపోయిన వారి సంఖ్య 40 దాట‌డంతో జిల్లా ఆరోగ్య శాఖ తీవ్రంగా ప‌రిగ‌ణించింది. మరోవైపు, గత 15 రోజులు నుండి జిల్లాలో చాలామంది కరోనా రోగులు మిస్సైనట్టు తెలుస్తోంది. కాగా, ఘజీపూర్ జిల్లాలో ఇప్పటివరకు 10 మంది కరోనా కార‌ణంగా మరణించగా.. ప్రస్తుతం 505 యాక్టివ్ కేసులు ఉన్నాయి.