TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శృతి మించిన విమర్శలు..రేవంత్ వర్సెస్ తలసాని!

Published on: Thu May 11, 2023 11:46AM

రాజకీయాలలో విమర్శలు.. ప్రతి విమర్శలు సాధారణ విషయం. అయితే అవి శృతి మించితే  ఎబ్బెట్టుగా, అసహ్యంగా ఉంటాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ల మధ్య పిసుకుడు చాలెంజ్  ఆ కోవకే చెందుతుంది. కాంగ్రెస్ యువ సంఘర్షణ సభలో ప్రియాంకగాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటనపై స్పందించేందుకు ప్రెస్ మీట్ పెట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

ఓ పొట్టోడు ఎమ్మెల్యేలను, మంత్రులను అందరినీ వాడు, వీడు అని మాట్లాడుతుండు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందు.. పిసికితే పాణం పోతదని పరోక్షంగా రేవంత్ రెడ్డినుద్దేశించి తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడీయాలో వైరల్ అయ్యాయి. తలసాని చేసిన కామెంట్లు దుమారం రేపడంతో,  రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. తలసానిని దున్నపోతుతో పోల్చి తీవ్ర విమర్శలు చేశారు.

దున్నపోతులతో తిరిగిన దున్నపోతు తలసాని శ్రీనివాసయాదవ్ అని, మొదట్నుంచి పశువుల పేడ పిసుక్కున్న అలవాటు తలసాని శ్రీనివాసరావుకుందని, అందుకే పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడంటూ  రేవంత్ రెడ్డి  కౌంటరిచ్చారు. అరటిపండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు గుట్కాలు నమిలే వ్యక్తులు కూడా తన గురించి మాట్టాడటమా అని ప్రశ్నించారు. తలసాని శ్రీనివాసయాదవ్ కు అంత పిసుకుడు కోరిక ఉంటే,ఎక్కడికి ఎప్పుడు రావాలో చెబితే తాను వస్తానని,అప్పుడు ఎవరు ఏం పిసుకుతారో అర్థమవుతుందని సవాల్ చేశారు.

కేసీఆర్ కాళ్లు పిసికినట్టు అనుకుంటున్నారేమో రేవంత్ రెడ్డిని పిసకటం అంటూ మండిపడ్డారు. మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తాను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని అని పేర్కొన్న రేవంత్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్ జీవితకాలం కేసీఆర్ చెప్పులు మోసినా, తన స్థాయికి రాలేరని తేల్చిచెప్పారు. ఇంకా ఏదైనా మోజుంటే, మోజు తీర్చుకోవాలంటే తాను వస్తానని రేవంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తేల్చి చెప్పారు.విషయమేమిటంటే.. పరిధిలు దాటి  పరస్పర విమర్శలతో రెచ్చిపోతున్న ఈ ఇద్దరూ కూడా ఒకప్పుడు టీడీపీలో కలిసి పని చేసిన వారే.  2014లో ఇద్దరూ టీడీపీ నుంచి గెలిచారు. తర్వాత తలసాని టీఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యారు. అప్పట్లో కూడా రేవంత్ రెడ్డి, తలసాని మధ్య ఘాటు విమర్శలు చోటు చేసుకునేవి. ఇప్పుడు మరోసారి.. తలసాని శ్రీనివాస్ యాదవ్, రేవంత్ ల మధ్య విమర్శలు మర్యాద పరిధి దాటుతున్నాయి.
ఓ వైపు ఎండలు..మరో వైపు అకాల  వర్షాలతో  రైతులు, ప్రజలు కష్టాలలో ఉంటే.. వాటిని విస్మరించి..  బాధ్యతాయుత పదవులలో ఉన్న నేతలు  యిలా చౌకబారు విమర్శలతో  కాలం గడిపేయడమేమిటని జనం ఛీత్కరించుకుంటున్నారు.