ఉస్మానియా పిల్లలపై లాఠీఛార్జీ దారుణం!

 

తమకు ఉద్యోగాలు చేయాలని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల మీద తెలంగాణ ప్రభుత్వం లాఠీఛార్జ్ జరిపించడం దారుణమన్న అభిప్రాయాలు తెలంగాణ వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. పార్టీలకు అతీతంగా ఈ ఘటనను ఖండిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు అయితే కేసీఆర్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఎంతో కృషి చేసిన ఉస్మానియా విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేయడం అత్యంత దారుణమైన చర్య అని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. అలాగే తెలంగాణలోని బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కూడా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ నాయకులు ఈ విషయం మీద కక్కలేక మింగలేక వున్నారు. ఉస్మానియా విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ఆమోదించాల్సిందిపోయి వారిమీద లాఠీఛార్జ్ చేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న టీఆర్ఎస్ పార్టీలో కూడా తలెత్తింది. సొంత ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయని అనుకున్న విద్యార్థులకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో లాఠీ దెబ్బలే మిగిలాయన్న సానుభూతి ఉస్మానియా విద్యార్థుల మీద వ్యక్తమవుతోంది.