హెల్మెట్లతో డాక్టర్ల నిరసన.. ఉస్మానియాలో ఉద్రిక్తత..
Published on: Tue Oct 26, 2021 6:12PM
నేను రానుబిడ్డో సర్కారు దవాఖానాకు.. అనే పాట ఫుల్ ఫేమస్. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు పడే అవస్థల గురించి వివరించే సాంగ్. సర్కారు దవాఖానా అంటేనే సమస్యల నిలయం. సరైన వసతులు ఉండవు, మెరుగైన వైద్యం లభించదు, సిబ్బంది పట్టించుకోరు, టెస్టులు మందుల కొరత.. ఇలా రోగుల అవస్థలు అన్నీఇన్నీ కావు. అయితే, ఇలాంటి సమస్యలు కేవలం రోగులకేనా? మాకూ ఉన్నాయంటున్నారు జూనియర్ డాక్టర్లు. మేము పనిచేయలేం సర్కారు దవాఖానాలో అంటూ జూడాలంతా ధర్నాకు దిగడం ఉస్మానియా ఆసుపత్రిలో ఉద్రిక్తతకు దారి తీసింది.
ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ పీజీ విద్యార్థినిపై ఫ్యాన్ విరిగి పడటం కలకలం రేపింది. బాధిత వైద్య విద్యార్థినికి గాయాలయ్యాయి. దీంతో జూడాలకు చిర్రెత్తుకొచ్చింది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. సమస్యలు తీర్చడం లేదంటూ వారంతా ధర్నాకు దిగారు. ఫ్యాన్ విరిగి మీదపడినందుకు నిరసనగా జూనియర్ డాక్టర్లు.. హెల్మెట్లు ధరించి డ్యూటీలకు హాజరై నిరసన తెలపడం సంచలనంగా మారింది.
ఉస్మానియా ఆసుపత్రిలో జూడాలు మౌన దీక్ష కూడా చేపట్టారు. ఘటనపై సూపరిండెంట్‌కి ఫిర్యాదు చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఉస్మానియాలో రోగులు, వైద్య సిబ్బదికి రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. జూడాలు ఇలా హెల్మెట్లు ధరించి డ్యూటీ చేయడం.. మౌన దీక్ష చేపట్టడం.. ఉస్మానియాలో సమస్యల తీవ్రతను తెలుపుతోంది.


