TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జో బైడెన్ తో అమెరికా సర్వనాశనమా..! పదేళ్ల క్రితమే బిన్ లాడెన్ జోస్యం? 

Published on: Tue Aug 24, 2021 10:32AM

ఆప్ఘనీస్తాన్ లో ప్రస్తుతం తాలిబన్ చేతుల్లోకి వెళ్లింది. 20 ఏండ్ల తర్వాత మళ్లీ ఆప్ఘనీస్తాన్ ను ఆక్రమించుకున్నారు తాలిబన్లు. అప్ఘన్ నుంచి అమెరికా తన బలగాలను ఉప సంహరించుకోవడంతోనే.. ఆపరేషన్ ప్రారంభించిన తాలిబన్లు కొన్ని రోజుల్లోనే కాబుల్ లోకి ఎంటరయ్యారు. తాలిబన్లకు భయపడి అధ్యక్షుడు అఫ్రస్ ఘనీ దేశం విడిచి పారిపోయాడు. దీంతో ఆప్ఘన్ సైన్యం నుంచి ప్రతిఘటన లేకుండానే తాలిబన్లకు అధికారం దక్కింది. అమెరికా వల్లే ఆప్ఘనీస్తాన్ తాలిబన్ల వశం అయిందనే ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతోంది. యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బైడెన్ తాలిబన్లకు సహకరించారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. 

తాజాగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కు సంబంధించి మరో సంచలన అంశం తెరపైకి వచ్చింది.  బైడెన్ అధ్యక్షుడైతే  అమెరికా సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ పదేళ్ల క్రితమే చెప్పాడనే విషయం వెలుగులోనికి వచ్చింది. 2011లో అమెరికా బలగాలు లాడెన్‌ను మట్టుబెట్టిన తర్వాత.. లాడెన్  రాసిన 48 పేజీల లేఖ లభ్యమైంది. మే 2010లో తన సోదరుడు అతియా అబ్దుల్ రహ్మాన్‌కు లాడెన్ ఈ లేఖ రాశాడు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, సీఐఏ డైరెక్టర్ డేవిడ్ పెట్రాస్‌ల విమానాలను లక్ష్యంగా చేసుకోవాలని అందులో సూచించిన లాడెన్.. బైడెన్‌ జోలికి వెళ్లొద్దని మాత్రం హెచ్చరించాడు.

ఒబామాను చంపేస్తే బైడెన్ అధ్యక్షుడవుతాడని, ఆయన అధ్యక్షుడయ్యాడంటే మన కల నెరవేరినట్టేనని తన లేఖలో బిన్ లాడెన్ చెప్పారు. అధ్యక్ష పదవికి బైడెన్ పూర్తిగా అసమర్థుడని, ఆయన  హయాంలో అమెరికా సంక్షోభంలో కూరుకుపోతుందని, అతడితోనే అమెరికా పతనం ప్రారంభమవుతుందని కూడా ఆ లేఖలో లాడెన్ పేర్కొన్నాడు. కాబట్టి బైడెన్‌కు ఎలాంటి హానీ తలపెట్టవద్దని 48 పేజీలున్న ఈ లేఖలో తన అనుచరులకు సూచించాడు. ఆ లేఖలోని 36వ పేజీలో రెండు హిట్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలన్న తన కోరికను లాడెన్ వెల్లడించాడు. అందులో ఒకటి పాకిస్థాన్‌లో, మరోటి ఆఫ్ఘనిస్థాన్‌లో ఏర్పాటు చేయాలన్నాడు. ఈ రెండూ ఒబామా, సీఐఏ డైరెక్టర్‌ల హత్యకు పథక రచన చేయాలని కోరాడు. 

బిన్ లాడెన్ రాసిన లేఖ 2012లో తొలిసారి ఈ లేఖ వెలుగులోకి రాగా, ఇప్పుడు ఆఫ్ఘన్ సంక్షోభం నేపథ్యంలో మరోమారు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకోవడం, ఆప్ఘనీస్తాన్ తాలిబన్ల వశం కావడంతో.. బైడెన్ విషయంలో లాడెన్ చెప్పింది నిజం కాబోతోందా? అన్న చర్చ జరుగుతోంది.