వివాదాస్పద వ్యవసాయ బిల్లు పై పార్లమెంట్ లో ప్రతిపక్షాల సంచలన నిర్ణయం..

కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద వ్యవసాయ బిల్లులు రాజ్యసభలో ఆమోదింపచేసుకున్న తీరుపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. అంతేకాకుండా రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్‌పై ప్రతిపక్ష పార్టీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకుని, ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు రాజ్యసభ నుంచి మూకుమ్మడిగా వాకౌట్ చేశాయి. ముందుగా కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, వామపక్షాలు వాకౌట్ చేయగా... ఆ తరువాత కొద్ది సేపటికే టీఆర్ఎస్, ఎన్సీపీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన, ఆర్జేడీ ఎంపీలు కూడా సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. అయితే సభ నుండి వాకౌట్ చేయవద్దనీ.. చర్చలో పాల్గొనాలంటూ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్షాలు వెనక్కి తగ్గలేదు. వాకౌట్ కు ముందు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. ఎనిమిది మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేసే వరకు సభా కార్యకలాపాలను ప్రతిపక్షాలు బహిష్కరిస్తాయని స్పష్టం చేశారు.

 

ఇది ఇలా ఉండగా ప్రతిపక్షాలన్నీ రాజ్యసభ నుంచి వాకౌట్ చేసిన నేపథ్యంలో సభ నుండి సస్పెండ్ ఐన ఎంపీలు కొద్దిసేపటి క్రితం ధర్నా విరమించారు. తాము కేవలం సస్పెన్షన్ ఎత్తివేయాలని మాత్రమే కోరడం లేదనీ... అసలు ఎలాంటి ఓటింగ్ లేకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను కూడా వెనక్కి తీసుకోవాల్సిందేనని ఎంపీలు కోరుతున్నారు.