TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నడకదారిలో చిరుత కలకలం 

Published on: Tue Nov 14, 2023 2:23PM

 తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో  కాలి నడకన వెళ్లడానికి భక్తులు జంకుతున్నారు. మంగళవారం (నవంబర్ 14)మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తున్నది. కడప జిల్లాలోని పులివెందులకు చెందిన కొంతమంది భక్తులు రోడ్డు దాటుతుండగా చిరుత పులి సంచారాన్ని గుర్తించారు. దీంతో విషయాన్ని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కాలినడక భక్తులను అధికారులు గుంపులుగుంపులుగా అనుమతిస్తున్నారు. వాటర్‌ హౌస్‌ వద్ద సెక్యూరిటీ సిబ్బంది భక్తులను నిలిపి బ్యాచులుగా పంపుతున్నారు. కాగా, మరోసారి చిరుత సంచారంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. గత ఆగస్టులో నెల్లూరు జిల్లాకు చెందిన మూడేండ్ల చిన్నారి లక్షితపై చిరుత పులి దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో లక్షిత మృతి చెందింది. అంతకు ముందు మరో బాలుడిపై కూడా చిరుత దాడి చేసింది. అయితే ఆ సమయంలో ఆ బాలుడి కుటుంబ సభ్యులు పెద్దగా అరవడంతో బాలుడిని కొద్ది దూరం తీసుకెళ్లి చిరుత వదిలి వెళ్లింది. దీంతో చిరుత పులలను బంధించేందుకు అటవీ, టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. చిరుతల కదలికలున్న మార్గాల్లో సీసీటీవీ కెమెరాలు, బోన్లను ఏర్పాటు చేసి వాటిని బంధించిన సంగతి విధితమే. అయితే తాజాగా మరో చిరుతపులి కన్పించడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. మెట్ల మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
 అధికారులకు సమాచారం అందగానే  అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. మెట్ల మార్గంలో నడిచి వెళ్లే భక్తులను గుంపులుగా అనుమతించాలని నిర్ణయించారు. ఒంటరిగా వెళ్లే భక్తులపై చిరుత దాడి చేసే అవకాశం ఉండడంతో సెక్యూరిటీ సిబ్బంది వాటర్ హౌస్ వద్ద భక్తులను ఆపుతున్నారు. గుంపులు గుంపులుగా వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.