ఏపీలో కాంగ్రెస్ ఒంటరి పోరు

 

తెలంగాణలో టీడీపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్‌.. ఆంధ్రప్రదేశ్‌ లో జరగనున్న ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ ప్రకటించారు. ఇవాళ విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని, ఏఐసీసీ ఆదేశాల మేరకు ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. ఎన్నికల కమిటీలపై ఈవారంలోనే నివేదిక పంపుతామని, ఎన్నికల వ్యూహంపై ఈనెల 31న మరోసారి చర్చిస్తామని ఊమెన్‌చాందీ తెలిపారు. ఫిబ్రవరిలో 13 జిల్లాల్లో బస్సుయాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని, బస్సుయాత్రపై ఈనెల 31న భేటీలో చర్చిస్తామని ఊమెన్‌చాందీ చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటనతో కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌ పెరిగిందని నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుందని నేతలు చెబుతున్నారు.