TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కన్నుల పండువగా ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం

Published on: Thu Apr 2, 2026 10:13AM

ఏకశిలా నగరం ఒంటిమిట్ట  పుణ్య భూమిపై  బుధవారం (ఏప్రిల్ 1) రాత్రి ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతమైంది. ఆకాశంలో నిండు చంద్రుడు అమృత కిరణాలను కురిపిస్తుండగా, భూమిపై రంగురంగుల విద్యుత్ కాంతులు పోటీ పడుతుండగా.. కోదండరామయ్య, సీతమ్మల కల్యాణ వేడుక   అత్యంత వైభవంగా, కన్నుల పండువగా సాగింది.

​ఒంటిమిట్ట కల్యాణ వేదికపై ప్రకృతి, సాంకేతికత ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. ఆకాశంలో నిండు పున్నమి చంద్రుడు వెన్నెల ధారలతో జగన్మాతను, జగదభిరాముడిని అభిషేకిస్తున్నట్లుగా తోచింది. అదే సమయంలో వేదిక అంతటా అమర్చిన రంగురంగుల విద్యుత్ కాంతులు ఒంటిమిట్ట పరిసరాలను ఒక రంగుల లోకంలా మార్చేశాయి. ఎరుపు, పసుపు, నీలి రంగుల ఎల్ఈడీ వెలుగులు పుష్పాలంకరణలను మరింత ప్రకాశవంతం చేయగా.. ఆ ప్రాంతంలోని ప్రతి అంగుళం ఒక దివ్య తేజస్సుతో విరాజిల్లింది.

 ​ఎదుర్కోలు ఉత్సవం సాగుతున్న సమయంలో విద్యుత్ దీపాల వెలుగులో ఉత్సవమూర్తులు ధరించిన బంగారు ఆభరణాలు మెరిసిపోతూ భక్తులకు కనువిందు చేశాయి.  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పట్టువస్త్రాలను మోస్తూ వస్తున్నప్పుడు, ఆ వెలుగుల వేడుక వేడుక ఒక రాజసం ఉట్టిపడేలా చేసింది.  ​వేదికపై అమర్చిన యాక్రిలిక్ పెయింటింగ్స్, శావతారాల సెట్టింగ్‌లు విద్యుత్ కాంతులతో సజీవంగా కదిలివస్తున్నాయా అన్న అనుభూతిని కలిగించాయి.

​వేద మంత్రాల ఘోష మధ్య స్వామివారి శిరస్సుపై ముత్యాల తలంబ్రాలు పోస్తున్న ఘట్టం భక్తులను పరవశింపజేసింది. ఆ ముత్యాల మెరుపులు రంగుల దీపాల కాంతిలో ఇంద్రధనస్సును తలపించాయి.  పౌర్ణమి చంద్రుని సాక్షిగా, రంగుల కాంతులు, వేదమంత్రాల నడుమ సీతారాముల కల్యాణాన్నితిలకించిన భక్తులు పులకించి పోయారు.

 ​సుమారు 9 టన్నుల స్వదేశీ, విదేశీ పూల సువాసనలు.. అగరు ధూపాలు.. వీటికి తోడు చల్లని  గాలులు కలసి ఒంటిమిట్టను ఈ భూలోక వైకుంఠంగా మార్చేశాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయ జయ రామ స్మరణలు మిన్నంటాయి.