TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సమకాలీన నేతల్లో ఒకే ఒక్కడు...

Published on: Wed Apr 20, 2022 10:38AM

ఈ రోజు (ఏప్రిల్ 20) తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, నిత్య యవ్వనుడు నారా చంద్రబాబు నాయుడు 73వ పుట్టిన రోజు. ముందుగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. 
నిజానికి, చంద్రబాబు నాయుడు గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవలసింది ఏదీ లేదు. ఆయన అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ముందు చూపున్న నాయకుడు. ఒక విజనరీ. అందుకే చంద్రబాబు అనగానే, ఆయన శ్రీకారం చుట్టిన ఆర్థిక, రాజకీయ, సామాజిక  సంస్కరణలు, విద్యుత్, ఐటీ రంగాలలో, సంక్షేమ, అభివృద్ధి రంగాలాలో ప్రవేశ పెట్టిన విప్లవాత్మక మార్పులు గుర్తుకువస్తాయి. ఈ రోజు హైదరాబాద్ విశ్వనగరంగా వెలుగొందుతోందంటే అందుకు చంద్రబాబు వేసిన పునాది రాయే కారణం. ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఐటీ హబ్’ గా ప్రపంచ  దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తోంది అంటే, అందుకు  1994 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలే కారణం. 
అప్పట్లో ఆయన, “నేను ముఖ్యమంత్రిని కాదు,సీఈఓను” అంటే, ఎంతో మంది ఏమో అనుకున్నారు. ఎగతాళి కూడా చేశారు. అయితే అప్పట్లో సీఈఓగా ఆయన నాటిన ఐటీ విత్తనమే ఈ రోజున మహా వృక్షమైంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్వావలంబనకు చంద్రబాబు నాటిన ఆ విత్తనమే అండగా నిలిచింది. అందుకే, చంద్రాబాబును రాజకీయంగా వ్యతిరేకించే వారైనా ఐటీ రంగంలో ఆయన చేసిన కృషిని కాదనరు. చివరకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, కేటీఆర్ కూడా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి చంద్రాబాబు చేసిన కృషిని కాదనలేమని మెచ్చుకున్న సందర్భాలున్నాయి.  
అందుకే చంద్రాబాబును, రాజకీయంగా వ్యతిరేకించే వారుంటారే కానీ, ఆయన చేసి చూపిన అభివృద్ధిని, ఆయన అభివృద్ధి నమునాను కాదనే వారుండరని అంటారు. కాదంటే, దానికి కొత్త పేర్లు తగిలించుకుని తమవిగా ప్రచారం చేసుకుంటే చేసుకుంటారు, కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాలలో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు కళ్ళుగా సమర్ధ పాలన అందించిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పేరు చరిత్ర పుటల్లో నిలిచి పోతుంది. ఇందులో  మాత్రం ఎవరికీ, రెండో అభిప్రాయం లేదు. 
చంద్రబాబు నాయుడు 73 లోకి అడుగుపెడుతున్న సమయంలో ఆయన రాజకీయ జీవితాన్ని ఒక్క సారి ‘రివైండ్’ చేసి చూస్తే నాలుగు పదులు దాటిన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎక్కని మెట్లు లేవు, చూడని లోతులు లేవు. విద్యార్ధి దశలోనే రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన 25 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. 28 ఏళ్లకే ‘చిన్న’ మంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానంలో, ఆయన,  ‘ఒకే ఒక్కడు’ గా నిలిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్’లో ఎందరు ముఖ్యమంత్రులు ఉన్నా, అందరి కంటే అత్యధిక కాలం,(తొమ్మిదేళ్ళ తొమ్మిది నెలల 19రోజులు) ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఒకే ఒక్కడు, చంద్రబాబు నాయుడు. అత్యధిక కాలం ప్రతిపక్ష నేతగా ఉన్నది కూడా ఆయనే. అలాగే, రాష్ట్ర విభజన అనంతరం అవశేష ఆంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన నాయకుడు  ఆయనే. ఇలా సుదీర్ఘ కాలం విభిన్నబాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించిన చంద్రబాబు నాయుడు, సమర్ధ పాలనకు, ముందు చూపుకు మరు పేరుగా చరిత్రలో నిలిచి పోయారు.
నిజానికి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా పరిపాలనకు ఎంత ప్రాముఖ్యత నిచ్చారో, పార్టీ నిర్మాణానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చారు. అందుకే, ఒక ప్రాతీయ పార్టీగా తెలుగు దేశం పార్టీ 40 ఏళ్ళు ప్రస్థానం సాగించడమే కాకుండా అందులో 21 ఏళ్ళు అధికారంలో, 19ఏళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమికను పోషించింది. అవును, చంద్రాబాబు తమ మనసులో మాటలో అన్నట్లుగా, ఎన్టీఆర్ పార్టీని స్థాపించి, తమ జనాకర్షణ శక్తితో, ఒకటిగా నిలిపితే చంద్రబాబు దాన్ని వ్యవస్థీకరించారు. సమర్ధ నాయకత్వంలో ఏకశిల సదృశ్య పార్టీగా నిలిపారు.  
రాష్ట్ర రాజకీయాలోనే కాదు జాతీయ రాజకీయాలోనూ చంద్రబాబు నాయుడు పోషించిన పాత్ర సామాన్య మైనది కాదు. నిజం.ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు, జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడం  అంటే అది మాములు విషయం కాదు. కానీ, చంద్రబాబు నాయుడు, జాతీయ స్థాయిలో అటు యూపీఏలో ఇటు ఎన్డీఎలో సుదీర్ఘ కాలం పాటు కీలక భూమికను పోషించారు. అలాగని, చంద్రబాబు నాయుడు తప్పులే చేయలేదా అంటే లేదు, ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితంలో తప్పులు చేశారు. అయితే, చేసిన తప్పులను దిద్దుకుంటూ ముదుకు సాగుతున్నారు. అందుకే, 73 ఏళ్ల వయసులోనూ, ఆయన ప్రతిపక్ష నేత భూమికను సమర్ధ వంతంగా పోషిస్తున్నారు. ఈ వయసులోనూ, తన వయసులో సగం వయసున్న  ముఖ్యమంత్రి  జగన్మిహన్ రెడ్డితో పోరాటానికి,  తగ్గేదేలే అంటున్నారు. పుట్టినరోజున కూడా టీడీపీ విద్యుత్ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన  ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమంలో పాల్గొంతున్నారు. మరో వంక  త్వరలోనే జిల్లాల పర్యటన కూడా చేపట్టనున్నారు.
చివరగా...మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, ‘కలలు కనండి. కన్న కలలను సాకారం చేసుకోండి’ అని యువతకు ఉద్భోదించారు. చంద్రబాబు ఆ మాటను అంతకు ముందే నిజం చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్న రోజుల్లోనే, ఆయన తమ సహచరుల వద్ద, "నాకు జీవితంలో ఓ ప్రధానమైన లక్ష్యం ఉంది"  అన్నారు. ఆ లక్ష్యం సరిగ్గా 20 ఏళ్ళ తరువాత నెరవేరింది.ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అందుకే కావచ్చును కలామ్’ ను రాష్ట్రపతి అభ్యర్ధిగా  అప్పటి  వాజపేయి ప్రభుత్వం ముందుంచారు. అందరినీ ఒప్పించి ఎపీజే అబ్దుల్ కలాంను  రాష్ట్రపతి చేయడంలో కీలక భూమికను పోషించారు.   
అందుకే, చంద్రబాబులోనూ లోపలున్నా, ఆయన చరిత్రలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు. రాజకీయాల్లో ఎత్తు పల్లాలు సహజం, కానీ, ఒడిదుడుకులను సమానంగా స్వీకరించి ముదుకు సాగే వారే.. నిజమైన చరిత్ర పురుషులు. సమకాలీన రాజకీయ నేతలలో   అలాంటి ఒకే ఒక్కడు’ చంద్రబాబు నాయుడు.