TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఏటా రూ. 25,000 కోట్ల దోపిడీ.. జాగ్రత్త!

Published on: Sat Jun 20, 2026 10:07AM

ఈ రోజుల్లో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరం ఏదో ఒక ఆన్‌లైన్ యాప్ ఉపయోగించేస్తున్నాం. క్యాబ్ బుకింగ్స్, ఫుడ్ డెలివరీలు, నిత్యావసర వస్తువుల ఆర్డర్లు లేదా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఇలా అన్నీ మన చేతివేళ్లపైనే నడుస్తున్నాయి. అయితే, ఇలా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు లేదా టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నప్పుడు మీ ప్రమేయం లేకుండానే కొన్ని అదనపు ఛార్జీలు పడటం కానీ, ఏదైనా డొనేషన్ బాక్స్ ఆటోమేటిక్‌గా టిక్ అయి ఉండటం కానీ మీరు గమనించారా? ఒకవేళ మీరు తొందరలో ఉండి వాటిని సరిచూసుకోకుండా పేమెంట్ బటన్ నొక్కేస్తే, మీ జేబుకు చిల్లు పడినట్లే. డిజిటల్ ప్రపంచంలో వినియోగదారులను మోసం చేయడానికి కంపెనీలు ఉపయోగించే ఈ మాయాజాలాన్నే 'డార్క్ ప్యాటర్న్స్' అని పిలుస్తారు. ఇవి కేవలం చిన్నపాటి అదనపు ఛార్జీలు మాత్రమే అనుకుంటే పొరపాటే. 'డార్క్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియాస్ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేసెస్' నివేదిక ప్రకారం, ఈ మోసపూరిత డిజైన్ల వల్ల భారతీయ వినియోగదారులు ఏటా ఏకంగా 25,000 కోట్ల రూపాయల నుండి 28,000 కోట్ల రూపాయల వరకు నష్టపోతున్నారు.

ఈ డార్క్ ప్యాటర్న్స్ అనేవి వినియోగదారుల స్వేచ్ఛను, సరైన నిర్ణయాలు తీసుకునే హక్కును దెబ్బతీస్తాయి. ఇందులో రకరకాల విచిత్రమైన పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకు, మీరు ఏదైనా ఫ్లైట్ టికెట్ లేదా సినిమా టికెట్ బుక్ చేసుకుంటున్నప్పుడు "ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఆఫర్ ఉంది", "ఇప్పటికే 50 మంది దీనికోసం చూస్తున్నారు" అంటూ టైమర్ రన్ అవుతూ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీనినే 'ఫాల్స్ అర్జెన్సీ' అంటారు. అంటే వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉందనే భ్రమను సృష్టించి, వినియోగదారులు ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా వెంటనే కొనేలా ఒత్తిడి తీసుకురావడం అన్నమాట. అలాగే, కొన్ని యాప్‌లలో మనం ఒక వస్తువును కొంటే, దానికి అదనంగా ఎక్స్‌టెండెడ్ వారెంటీనో, లేదా ఫుడ్ డెలివరీ యాప్స్‌లో ప్రైమ్ మెంబర్‌షిప్‌నో మనకు తెలియకుండానే కార్ట్‌లో యాడ్ చేసేస్తుంటారు. దీనిని 'బాస్కెట్ స్నీకింగ్' అంటారు.

మరికొన్ని సైట్లలో ఏదైనా ఆసక్తికరమైన ఆర్టికల్ చదువుదామంటే, మధ్యలోనే ఆపి ఉచితంగా సైన్-అప్ అవ్వమనో లేదా యాప్ డౌన్‌లోడ్ చేసుకోమనో బలవంతం చేస్తాయి. దాన్నే 'ఫోర్స్డ్ యాక్షన్' అంటారు. ఇక అన్నింటికంటే విసిగించేది 'సబ్‌స్క్రిప్షన్ ట్రాప్'. ఒక ఛానెల్‌నో లేదా సర్వీస్‌నో సబ్‌స్క్రైబ్ చేసుకోవడం కేవలం ఒక మిస్డ్ కాల్ లేదా సింగిల్ క్లిక్‌తో అయిపోతుంది. కానీ, దానిని క్యాన్సిల్ చేయాలనుకుంటే మాత్రం కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి, రోబోలతో మాట్లాడి, యాప్‌లో ఎక్కడో దాగి ఉన్న ఆప్షన్‌ను వెతుక్కోవాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డుల క్లోజర్ విషయంలో కూడా ఆన్‌లైన్ ఆప్షన్ ఇవ్వకుండా, నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాలని ముప్పుతిప్పలు పెడుతుంటారు. బిల్లింగ్ పేజీకి వెళ్లేవరకు అసలు ధరను దాచిపెట్టి, చివరి నిమిషంలో ప్లాట్‌ఫారమ్ ఫీజులు, ప్యాకేజింగ్ ఫీజులు కలపడాన్ని 'డ్రిప్ ప్రైసింగ్' అంటారు. చదువుతున్నప్పుడు లేదా వీడియోలు చూస్తున్నప్పుడు పదే పదే యాడ్స్ చూపిస్తూ విసిగించడాన్ని 'నాగింగ్' అని పిలుస్తారు.

ఈ తీవ్రమైన వినియోగదారుల దోపిడీని అరికట్టడానికి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) నవంబర్ 2023లోనే ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో మొత్తం 13 రకాల డార్క్ ప్యాటర్న్స్‌ను నిషేధించారు. అయినప్పటికీ కంపెనీలు తమ పద్ధతులు మార్చుకోకపోవడంతో, జూన్ 2025లో సీసీపీఏ మరోసారి కఠినమైన అడ్వైజరీ జారీ చేసింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు తమను తాము ఆడిట్ చేసుకుని, ఈ మోసపూరిత డిజైన్లను తొలగించాలని ఆదేశించింది. రూల్స్ బ్రేక్ చేసినందుకు గానూ జూన్ 2026లో ఫిజిక్స్ వాలా (PhysicsWallah) సంస్థకు 5 లక్షల రూపాయలు, మెకాఫీ (McAfee) సంస్థకు 1 లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. చట్టాలు ఉన్నప్పటికీ, కంపెనీల పూర్తి స్థాయి మార్పు కోసం మనం ఇంకా వేచి చూడాల్సిందే. కాబట్టి ఆన్‌లైన్ లావాదేవీలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, చివరి పేమెంట్ పేజీలో ప్రతీ అంకెను క్షుణ్ణంగా పరిశీలించడం ఎంతైనా అవసరం.