ఉల్లి సెగ... కిలో రూ.150 రూపాయలు మాత్రమే !!

 

ఉల్లి సంక్షోభంతో దేశమే కుదేలవుతోంది. ఉల్లి ధర సెంచరీ దాటేసి రోజురోజుకు మరింత ఘాటుగా మారుతోంది. సంక్రాంతి దాటితే కానీ రేట్లు దిగి వచ్చే అవకాశం లేకపోవటంతో ఉల్లి పేరు చెబితేనే వినియోగదారుల గుండెలు గుబేలు మంటున్నాయి. ఉల్లి ఘాటు ఇప్పట్లో తగ్గేలా లేదు. ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత వారం రిటైల్ ధర కిలో రూ.100 రూపాయలు ఉండగా ఇప్పుడు రూ.150 రూపాయల వరకు వెళ్ళనుంది. బుధవారం ( డిసెంబర్ 4వ తేదీ) క్వింటా ఉల్లి కర్నూలు మార్కెట్ లో రూ.12510 రూపాయలు ఉండగా హైదరాబాద్ లో రూ.15000 వేల రూపాయలు పలికింది. దీంతో రెండు రాష్ట్రాల్లో ని రిటైల్ వ్యాపారులు ఇప్పుడే కిలో రూ.150 రూపాయలని అనేస్తున్నారు. ఇంకా ధర పెరుగుతుందనే ఉద్దేశంతో చాలా మంది సరుకు లేదని చెప్పేస్తున్నారు. ఉల్లి అధికంగా పండించే రాష్ట్రాల్లోనే ప్రస్తుతం పంట ఉత్పత్తి లేకపోవటంతో మార్కెట్ కు సరుకు రాక తగ్గిపోయింది. గతంలో కర్నూలు మార్కెట్ కు రోజుకు  5-6 వేల క్వింటాళ్ళు హైదరాబాద్ హోల్ సేల్ మార్కెట్ కు 200 లారీల సరుకు వచ్చేది. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పంట నిల్వలు తగ్గిపోయి మార్కెట్ కు సరుకు రావడం బాగా తగ్గిపోయింది.

నాసిక్, సోలాపూర్ నుంచి చాలా రాష్ట్రాలకు ఉల్లి రవాణా జరుగుతోంది. అక్కడి నుంచి ఉల్లి తెప్పించాలంటే రవాణా ఆలస్యం కావడమే కాకుండా ఖర్చులు భారమవుతాయని వ్యాపారులు పెద్దగా సరుకు తెప్పించడం లేదు. ఏపీలోనే రైతు బజార్ లలో కిలో ఉల్లి రూ.25 రూపాయలకే సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మార్కెటింగ్ అధికారులు కర్నూలు మార్కెట్ కు వస్తున్న ఉల్లిపాయలను కొని రైతు బజార్ లకు తరలిస్తున్నారు. సబ్సిడీ పై ఉల్లిని అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కర్నూలు మార్కెట్ లో ఓ వైపు వ్యాపారులు మరో వైపు అధికారులు పోటీ పడి ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఉల్లి రైతుల మాట చెల్లుబాటు అవుతుంది. కానీ సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న ఉల్లి పంట సంక్రాంతి తర్వాత మార్కెట్ కు వస్తుందని అప్పటికీ ఉల్లి నిల్వలు అడుగంటి పోతాయని మార్కెటింగ్ వర్గాల సమాచారంతో కేంద్ర ప్రభుత్వం ఈజిప్టు నుంచి ఉల్లి దిగుమతి చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఈజిప్టు ఉల్లి ఇంకా రాష్ట్రాలకు చేరలేదు. దీంతో ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ రాష్ట్రాల సీఎస్ ను ఆదేశించారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో బడా వ్యాపారులు నిల్వలను  పొదుపుగా వదులుతుండడంతో కొరత తీరడం లేదని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.