TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

చీరాలలో ఆమంచి, కరణం మధ్య  "పంచాయితీ"  

Published on: Mon Feb 1, 2021 1:40PM

ఆంధ్రప్రదేశ్ లో  పంచాయతీ ఎన్నికల హడావిడి పీక్స్ కు చేరుతోంది. ఈ ఎన్నికలలో పొలిటికల్ పార్టీలు కానీ వాటి గుర్తులు కనిపించకపోయినప్పటికీ ఆయా పార్టీలు బలపరిచిన అభ్యర్థులు పోటీలో ఉండడంతో గ్రామాలలో పొలిటికల్ టెన్షన్ మొదలైంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికలలో ఏకగ్రీవాలు కాకూడదని.. తమ పార్టీ అనుచరులు తప్పకుండ నామినేషన్లు వేయాలని చంద్రబాబు సూచిస్తుండగా.. మరో వైపు అధికార వైసీపీలో వర్గ విభేదాలు బయటకు వస్తుండడంతో వైరి వర్గాలు ఇద్దరేసి చొప్పున సర్పంచ్ అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. ఈ పరిణామంతో గ్రామాలలోని వైసిపి అభిమానులు తీవ్ర గందరగోళానికి గురౌతున్నారు. పంచాయతీ ఎన్నికలలో నిలబడ్డ ఇద్దరు వైసిపి సానుభూతిపరులలో ఎవరికీ ఓటు వేయాలో తేల్చుకోలేక సతమవుతున్నారు.

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీకి వైసీపీలోని రెండు వర్గాలు పోటీపోటీగా నామినేషన్లు దాఖలు చేసాయి. ఇక్కడ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కరణం బలరాం.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు పోటీపోటీగా నామినేషన్లు వేసి స్థానికంగా పొలిటికల్ హీట్ పెంచేశారు. అంతేకాకుండా సర్పంచ్ స్థానంతోపాటు వార్డు మెంబర్ స్తానాలకు కూడా విపరీతంగా నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో నామినేషన్ల్ ఉపసంహరణ తేదీ అయిన ఫిబ్రవరి 4న ఎవరు నామినేషన్లు వెనక్కి తీసుకుంటారు..? ఎవరు ఎన్నికల బరిలో నిలుస్తారు? అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.