TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రామతీర్ధం రాక్షసకాండకు ఏడాది.. ఇంకా నిందితుల‌ను ప‌ట్టుకోలేదేమి?

Published on: Tue Dec 28, 2021 11:17AM

డిసెంబ‌ర్ 30.. 2020. బ్రేకింగ్ న్యూస్‌తో ఆంధ్ర రాష్ట్రానికి తెల్లారింది. విజ‌య‌న‌గ‌రం జిల్లా రామ‌తీర్థంలో దారుణం జ‌రిగింది. నీలాచలం కొండ‌పై కొలువున్న కోదండ‌రాముని మూల విరాట్ శిర‌స్సును ఖండించారు కొంద‌రు ఉన్మాదులు. కావాల‌నే.. కుట్ర పూరితంగానే.. రాములోరి శిర‌చ్ఛేద‌న చేశారు. ఎల‌క్ట్రిక్ రంపంతో విగ్ర‌హ త‌ల క‌ట్ చేశార‌ని అన్నారు. ఈ విష‌యం తెలిసి.. యావ‌త్ రాష్ట్రం ఉలిక్కిప‌డింది. హిందువుల మ‌నోభావాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. టీడీపీ, బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేశాయి. హిందుత్వ సంఘాలు తీవ్ర నిర‌స‌న‌లు తెలిపాయి. రామ‌తీర్థం ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా అల‌జ‌డి రేపింది.

అప్ప‌టికి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి ఏడాదిన్న‌ర‌. రామ‌తీర్థం ఘ‌ట‌నే మొద‌టిది కాదు. అంత‌కుముందు అంత‌ర్వేది ర‌థం అగ్నికి ఆహుతి అయింది. అక్క‌డా కొంద‌రు దుర్మార్గులు కావాల‌నే ర‌థానికి నిప్పు పెట్టారు. అప్పుడూ అలానే ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ర‌గిలిపోయారు. అంత‌ర్వేది ర‌థం ద‌గ్థం వ్య‌వ‌హారం మ‌రిచిపోక‌ముందే.. డిసెంబ‌ర్ 29 రాత్రి రామ‌తీర్థం కోదండ‌రామ విగ్ర‌హం శిర‌స్సు తెగిప‌డింది. 

ఆ రెండు ఘ‌ట‌న‌ల‌కు సంబంధం ఉంద‌నే అంటున్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే వ‌రుస ప‌రిణామాల‌కు కార‌ణమ‌నే ఆరోప‌ణ ఉంది. అంత‌ర్వేది ర‌థం ద‌గ్థం అయిన వెంట‌నే నిందితుల‌ను ప‌ట్టుకొని క‌ఠినంగా శిక్షించి ఉంటే.. రామ‌తీర్థం దారుణం జ‌రిగి ఉండ‌క‌పోవ‌చ్చు. రామ‌తీర్థం రాక్ష‌స‌కాండ జ‌రిగి ఏడాది అవుతోంది. ఇప్ప‌టికీ కోదండ‌రాముని మూల విరాట్ శిర‌స్సు ఖండించిన ఉన్మాదులు ఎవ‌రో తెలుసుకోలేక‌పోయింది ప్ర‌భుత్వం. 23 కేసులైతే పెట్టారు కానీ నిందితుల‌ను ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌ట్టుకోలేక పోయారు పోలీసులు. రామ‌తీర్థం అనే కాదు.. అంత‌కుముందు జ‌రిగిన అంత‌ర్వేది ర‌థం ద‌గ్థం దోషుల‌నూ గుర్తించ‌లేక పోయింది. ఆ రెండు ఘ‌ట‌న‌లో నిందితులు ఎవ‌రో ఇప్ప‌టికీ అంతుచిక్క‌లేదు. ఇది ముమ్మాటికీ పోలీసులు, వైసీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే అనే విమ‌ర్శ‌లు ఉన్నాయి.   

రామ‌తీర్థం రావ‌ణాసురుల‌ను పట్టుకోలేని చేత‌గాని ప్ర‌భుత్వం.. ధ్వంసమైన రాముని విగ్ర‌హం స్థానంలో కొత్త విగ్ర‌హాలు త‌యారు చేయించి.. హ‌డావుడిగా పునఃప్ర‌తిష్ట చేసింది. ఆ కార్య‌క్ర‌మానికి రాజ‌వంశీకులైన అశోక్ గ‌జ‌ప‌తిరాజు హాజ‌రైతే.. ఆయ‌న్ను అవ‌మానించి.. తిరిగి ఆయ‌న మీదే కేసు పెట్టి.. కక్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డింద‌ని భ‌క్తులు మండిప‌డుతున్నారు. కోదండరాముని మూల విరాట్ శిరస్సు ఖండించిన దోషులను ఇంత వరకు ప్రభుత్వం పట్టుకోలేదని రామభక్త సమాజం నిరసన తెలుపుతూ దీక్ష చేపట్టింది. సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వ‌ర్యంలో దీక్ష జ‌రిగింది.