TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

అమరావతిని శిధిల స్థితిలో చూస్తుంటే బాధేస్తోంది

Published on: Wed Dec 16, 2020 2:07PM

జగన్ సర్కార్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో ఏడాది పుర్తి చేసుకున్న నేపథ్యంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

 

"విభజన తర్వాత నవ్యాంధ్ర రాజధానిగా ప్రణాళికాబద్ధమైన ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించుకునే అవకాశం మనకు వచ్చింది. రాజధానిగానే కాకుండా 13 జిల్లాల అభివృద్ధికి అవసరమైన సంపద సృష్టి, యువతకు ఉపాధి కేంద్రంగా ఆ నగరాన్ని నిర్మించాలనుకున్నాం. ఆ కారణంగానే ఐదు కోట్ల ఆంధ్రులూ గర్వంగా చెప్పుకునేలా ప్రజారాజధాని అమరావతిని నిర్మించేందుకు ఆనాడు సంకల్పించాం. రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తు కోసం రాజధాని ప్రాంత రైతులు 33వేల ఎకరాల భూములను త్యాగం చేశారు." అని చంద్రబాబు అన్నారు.

 

"ఆనాడు అమరావతి శంకుస్థాపన కోసం రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి పవిత్రస్థలాల మట్టిని, నీటిని పంపించి రాష్ట్ర ప్రజలు తమ ఆకాంక్షను, ఆమోదాన్ని తెలియజేసారు. అలా ఊపిరిపోసుకున్న అద్భుత రాజధాని అమరావతి నగరాన్ని ఈరోజు శిధిల స్థితిలో చూస్తుంటే బాధేస్తోంది." అని ఆవేదన వ్యక్తం చేశారు.

 

"రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఈ ప్రభుత్వం ఆడుతోన్న మూడు ముక్కలాటకు వ్యతిరేకంగా ఉద్యమించకపోతే రేపటి తరాలకు కలిగే నష్టాలకు మనమే బాద్యులం అవుతాం. అందుకే రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలి. ఆంధ్రులందరిదీ ఒకే మాట,ఒకే రాజధాని అని చాటాలి." అని చంద్రబాబు పిలుపునిచ్చారు.