స్టూడెంట్స్‌కి బంపర్ ఆఫర్.. క్లాసుకో టీవీ ఛానల్.. డిజిటల్ యూనివర్సిటీ కూడా..
Published on: Tue Feb 1, 2022 12:17PM
కరోనాతో రెండేళ్లుగా విద్యా వ్వవస్థ సర్వ నాశనం. సరిగ్గా క్లాసులు జరిగిందే లేదు. స్కూళ్లు తెరిచిందే లేదు. స్టూడెంట్స్ అంతా స్టడీస్‌లో బాగా వెనకబడ్డారు. క్లాస్ టాపర్‌కి కూడా చదువు ఒంటపట్టడం లేదు. అందరూ పాస్ అవుతున్నారే కానీ.. ఎవరికీ ఏమీ రావడం లేదు. కరోనాతో చదువులన్నీ అటకెక్కినట్టే. అయితే, బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు మాత్రం ఆన్లైన్ క్లాసులతో కాస్తో కూస్తో రాణిస్తున్నారు. ముందుముందు సైతం ఆన్లైన్ చదువులు తప్పకపోవచ్చని అంటున్నారు. అందుకే, కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ఓ అద్బుతమైన ఆలోచనను ఆవిష్కరించింది.
ఈ బడ్జెట్లో విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విద్యార్థులందరికీ ఈ-కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా డిజిటల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్లు.. టీవీల ద్వారా అనుబంధ విద్యను అందించనున్నట్లు ప్రకటించారు.
వన్ క్లాస్.. వన్ టీవీ ఛానల్..
‘‘ప్రధాని ఈ-విద్య కార్యక్రమం ద్వారా అనుబంధ విద్య విధానాన్ని మరింత విస్తరించనున్నాం. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు 12 టెలివిజన్ ఛానళ్లు ఉండగా.. వీటిని 200 ఛానళ్లకు పెంచుతున్నాం. ఒక్కో తరగతికి ఒక్కో ఛానల్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ టీవీల్లో తరగతుల బోధన చేపట్టనున్నాం. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్, టీవీ, రేడియోల ద్వారా తరగతుల బోధన ఉంటుంది. ఇక ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నాం. డిజిటల్ విద్య అందించే ఉపాధ్యాయులకు ప్రపంచస్థాయి ఉపకరణాలు అందజేయనున్నాం’’ అని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
డిజిటల్ యూనివర్సిటీ..
‘‘విద్యార్థులకు ఐఎస్టీఈ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు ప్రత్యేకంగా డిజిటల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నాం. దేశంలోని ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండేలా, అర్థం అయ్యేలా పలు భారతీయ భాషల్లో కోర్సులను ఈ వర్సిటీ అందించనుంది. ప్రస్తుతమున్న టాప్ యూనివర్సిటీల సహకారంతో ఈ డిజిటల్ వర్సిటీలో కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నాం’’ అని ప్రకటించారు.


