డిప్యూటీ ఆన్ డ్యూటీ.. మోదీకి మొదటి షాక్..!!

ఈమధ్య హాట్ టాపిక్ అయిన విషయాల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఒకటి.. ఈ పదవి కోసం అధికారపక్షం, విపక్షం నువ్వానేనా అంటూ పోటీ పడ్డాయి.. అయితే ఎట్టకేలకు అధికారపక్షం బీజేపీ బలపరచిన అభ్యర్థి హరివంశ్ సింగ్ విజయం సాధించారు.. ఇంకేముంది బీజేపీ ఫుల్ హ్యాపీ.. అయితే హ్యాపీగా ఉన్న బీజేపీకి మొదటిరోజే షాక్ ఇచ్చారు హరివంశ్.

 

 

ఇంతకీ విషయం ఏంటంటే.. ఒక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలుగా రిజర్వేషన్ ఉన్న వారు మిగిలిన రాష్ట్రాల్లో సైతం ఎస్సీ ఎస్టీలుగా ఆ సౌలభ్యాన్ని అనుభవించేట్లు రాజ్యాంగాన్ని సవరించాలని సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎంపీ విశ్వంభర్ ప్రసాద్ నిషాద్ ఒక ప్రైవేటు తీర్మానాన్ని పెట్టారు.. అయితే, ఇది అసాధ్యమని ఒక కులాన్ని ఎస్సీ, ఎస్టీ లేదంటే ఓబీసీ అనే కేటగిరిల్లో చేర్చటానికి పెద్ద ప్రక్రియ ఉంటుందని.. అలాంటి వేళ దేశం మొత్తానికి ఒకే విధానం అసాధ్యమని సామాజిక న్యాయశాఖామంత్రి థావర్ చంద్ గెహ్లాట్ తేల్చి చెప్పారు.. అయినా విపక్షాలు ఎందుకు ఊరుకుంటాయి.. ఈ అంశంపై ఓటింగ్ జరగాలని పట్టుపట్టాయి.. ఫస్ట్ డే డ్యూటీ మంచి కిక్ ఉండాలి అనుకున్నారేమో హరివంశ్ ఓటింగ్ కి ఓకే చెప్పేసారు.. ఇలాంటి అనుమతి ఇవ్వటం అసాధారణమని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేసినా హరివంశ్ వినలేదు.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అన్నట్టుగా, తాను ఒకసారి రూలింగ్ ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోనని తేల్చి చెప్పారు.. దీంతో విపక్షాలు హ్యాపీ, అధికారపక్షానికి బీపీ.. పాపం బీజేపీ తమ పార్టీకి చెందిన సభ్యులను సభలోకి రప్పించటానికి ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది.. అదే సమయంలో సభలో విపక్ష సభ్యులు ఎక్కువగా లేకపోవటంతో ఇబ్బందికర పరిస్థితి నుంచి మోడీ సర్కారు బయటపడగలిగింది.. చివరకు సభలో 66-32 ఓట్ల తేడాతో ఓటింగ్ లో మోదీ సర్కారు విజయం సాధించింది.. పొరపాటున విపక్ష సభ్యులు ఎక్కువగా ఉండుంటే మోదీ సర్కార్ ఇరుకున పడేదే.