TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చ‌ద్దా వెన‌క ఇంత చ‌ద‌రంగ‌ముందా?

Published on: Sat Apr 25, 2026 10:55AM

రాఘవ్ చద్దా,  ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య చోటుచేసుకున్న ఈ పరిణామాలు భారత రాజకీయాల్లో మరీ ముఖ్యంగా  పంజాబ్, ఢిల్లీ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారాయి.   రాఘవ్ చద్దా ఎందుకు బయటకు వచ్చారు? అని చూస్తే.. చాలా కాలంగా పార్టీ అధినాయకత్వంతో చద్దాకు ఉన్న విభేదాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి.  రాజ్యసభలో పార్టీ  డిప్యూటీ ఫ్లోర్ లీడర్  పదవి నుంచి ఆయన్ని తొలగించడం ఈ వివాదానికి ప్రధాన కార‌ణ‌మైంది. ప్రభుత్వంపై సరైన రీతిలో పోరాడటం లేదనే సాకుతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.

తాను పదిహేనేళ్ల  వయస్సు నుంచి పార్టీకి రక్తాన్ని, చెమటను ధారపోశానని.. కానీ ఇప్పుడు ఆప్ తన నైతిక విలువలను కోల్పోయిందని  ఆరోపించారు చ‌ద్దా.  తాను తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని  అని రాఘవ్ చద్దా ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. 

ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై  అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా.  ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో  ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్,  అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు. 

ఈ  గేమ్  వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటి? అని ప‌రిశీలిస్తే..  ఫిరాయింపుల నిరోధక చట్టం ప్ర‌ధానంగా క‌నిపిస్తోంది. రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీకి చెందిన ఎంపీల్లో రెండింట మూడొంతుల మంది సభ్యులు వేరే పార్టీలో విలీనమైతే..  వారిపై అనర్హత వేటు పడదు. ఆప్ ఎంపీల సంఖ్య 10 కాబట్టి, ఏడుగురు ఆప్ ను వీడితే ఆ ఏడుగురిపైనా అనర్హతవేటు పడదు.  ఇక‌పోతే పంజాబ్ ఎన్నికలే టార్గెట్. 2027లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు వెళ్తున్న ఎంపీల్లో ఆరుగురు పంజాబ్ కోటా నుంచి వచ్చిన వారే. వీరి ద్వారా పంజాబ్‌లో ఆప్‌ను బలహీనపరిచి, తాను బలపడాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. 

అరవింద్ కేజ్రీవాల్ ఈ పరిణామాలపై స్పందిస్తూ.. ఇది బీజేపీ   కుట్ర అని, పంజాబ్ ప్రజలను బీజేపీ మ‌రో మారు మోసం చేస్తోందని ఆరోపించారు.   బేసిగ్గా, ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక పెద్ద షాక్. ముఖ్యంగా సందీప్ పాఠక్ వంటి మేధావి, వ్యూహ‌క‌ర్త‌, రాఘవ్ చద్దా వంటి యువ నేత పార్టీని వీడటం కేజ్రీవాల్‌కు గట్టి దెబ్బే అంటున్నారు పరిశీలకులు. రాబోయే రోజుల్లో పంజాబ్ ప్రభుత్వ స్థిరత్వంపై కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.