TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌తోనే అధిక ముప్పు.. వారికి మ‌రింత డేంజ‌ర్‌..

Published on: Thu Feb 3, 2022 11:39AM

మీరు గ‌మ‌నించారా.. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా పెద్ద సంఖ్య‌లో క‌రోనా బారిన ప‌డుతున్నారు. వైర‌స్ నుంచి వారు త‌ప్పించుకోలేక‌పోతున్నారు. ఇదంతా ఒమిక్రాన్ వేరియంట్ వ‌ల్లే అనుకుంటున్నారు చాలామంది. అయితే, ఒమిక్రాన్ కాస్త బెట‌ర్‌.. దాని ఉప వేరియంట్ మ‌రింత డేంజ‌ర‌స్ అంటున్నారు సైంటిస్టులు. ఇప్ప‌టికే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా.. కొవిడ్ సోకినా.. బూస్ట‌ర్ డోసు సైతం త‌ప్ప‌క తీసుకోవాల్సిందేన‌ని సూచిస్తున్నారు. ఇంత‌కీ, ఆ సైంటిస్టుల ప‌రిశోధ‌న ఏం చెబుతోందంటే... 

ఒమిక్రాన్‌ అసలు వైరస్‌ కన్నా, దాని ఉప-వేరియంట్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్టు డెన్మార్క్‌ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఒమిక్రాన్‌ అసలు వేరియంట్‌ (బీఏ1), దాని ఉప-వేరియంట్‌ (బీఏ2)ల వ్యాప్తి తీరు ఎలా ఉందన్న విషయమై స్టాటెన్స్‌ సీరం ఇన్‌స్టిట్యూట్, యూనివర్సిటీ ఆఫ్‌ కోపెన్‌ హేగన్, టెక్నికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ డెన్మార్క్‌ల పరిశోధకులు ప‌లు ప‌రిశీల‌న‌లు జ‌రిపారు. 

‘‘ఒమిక్రాన్‌ అసలు వేరియంట్‌ వ్యాప్తి రేటు 29% ఉండ‌గా.. ఉప వేరియంట్‌ బీఏ2 వ్యాప్తి రేటు 39% గా ఉన్న‌ట్టు గుర్తించారు. కొవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నవారికి కూడా ఉప వేరియంట్‌ సోకుతోంది. వ్యాక్సిన్‌ తీసుకోని వారికి ముప్పుతో పాటు, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటోంది’’ అని శాస్త్రవేత్తలు తెలిపారు. 

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు చేపట్టిన మరో పరిశోధనలోనూ ఇలాంటి ఫలితాలే వ‌చ్చాయి. ‘‘ఒమిక్రాన్‌ వేరియంట్ల కారణంగా కొవిడ్‌కు గురై.. రిక‌వ‌రీ అయిన‌వారు కూడా బూస్టర్‌ డోసు తీసుకోవడం ముఖ్యం. బూస్ట‌ర్ డోస్ తీసుకుంటేనే.. భవిష్యత్తులో పుట్టుకొచ్చే కొత్త వేరియంట్ల నుంచి రక్షణ లభిస్తుంది’’ అని పరిశోధకులు సూచించారు.