ఒమిక్రాన్ పంజా పిల్లలపైనేనా? పెను గండం తప్పదా?
Published on: Tue Dec 28, 2021 9:24AM
కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే యూరప్ దేశాలు అల్లాడిపోతుండగా... యూఎస్ఏలోనూ క్రమంగా పంజా విసురుతోంది. కొవిడ్ తీవ్రత డెల్టా ప్లస్ వేరియంట్ తో పోల్చితే తీవ్రత తక్కువగా ఉందని చెబుతున్నా.. పిల్లలపై వేగంగా ప్రభావం చూపిస్తోందని తెలుస్తోంది. అమెరికాలో గత వారం రోజుల్లో వైరస్ భారీన పడిన చిన్నారుల సంఖ్య భారీగా పెరిగింది. అంతేకాదు అందులో చాలా మంది హాస్పిటల్ లో చేరాల్సి వస్తుండటం మరింత ఆందోళన కల్గిస్తోంది. బ్రిటన్, రష్యాలోనూ మొదటి, రెండవ వేవ్ లో పోల్చితే.. ఒమిక్రాన్ సోకిన చిన్నారుల సంఖ్య ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
మన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా అన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చేరుకున్న ఒమిక్రాన్... తాజాగా పర్యాటక ప్రాంతమైన గోవాలో అడుగుపెట్టింది. గోవాలో 8 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఈ నెల 17న యూకే నుంచి ఈ బాలుడు వచ్చాడు. యూకే ఎయిర్ పోర్టులో నిర్వహించిన పరీక్షల్లో అతనికి నెగెటివ్ అని తేలింది. దీంతో, అతను ఇండియాకు చేరుకున్నాడు.ఇండియాకు వచ్చిన తర్వాత ఇక్కడ మన వైద్య సిబ్బంది అతనికి పరీక్షలను నిర్వహించింది. టెస్టుల్లో అతనికి కోవిడ్ పాజిటివ్ రావడంతో... అతని శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. ఈ పరీక్షల్లో అతనికి ఒమిక్రాన్ సోకిందని నిర్ధారణ అయింది. గోవాలో ఒమిక్రాన్ కేసు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో గోవా ప్రభుత్వం అప్రమత్తమైంది. అతనికి కాంటాక్టులోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.
దేశంలో ఇప్పటివరకు మొత్తం 653 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వారిలో 186 మంది కోలుకున్నారని వివరించింది. తెలంగాణలో మొత్తం 55 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా వారిలో 10 మంది కోలుకున్నారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో 6 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా వారిలో ఒక్కరు కోలుకున్నారని పేర్కొంది.


