ఎన్నికల హోరు.... హమీల జోరు

ప్రారంభమైపోయింది. అగ్గి రాజుకుంటోంది. ఇంకా ఏడాది కాలం ఉన్నా దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి ఊపందుకుంటోంది. దీనికి సంకేతమే కేంద్రంలోనూ.... రాష్ట్రాల్లోనూ అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్నికల హామీలు గుప్పించేస్తున్నారు. ఇదే అదను...ఓటర్లను మా వైపు తిప్పుకుందుకు అనే కొత్త రాగాలు ఆలపిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఓటర్ల మనసు కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటర్ల కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హీమీల గాలాలు అల్లుకుంటున్నారు. త్వరలో జరుగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో విజయావకాశాలను బట్టి అన్ని పార్టీలు తమ తమ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తే ఒక విధంగానూ... అనుకూలంగా వస్తే మరో విధంగానూ పావులు కదపాలని బిజేపీ కూడా భావిస్తోంది. ఈ నాలుగు రాప్ట్రాల ఫలితాలపైనా వారి భవితవ్యం ఆధారపడి ఉందని తెలుస్తోంది.

 

 

ఈ రాఫ్ట్రాలతో పాటు కేంద్రంలో కూడా అధికారం కోసం ముందుగా భారతీయ జనతా పార్టీ తన కత్తులు నూరుతోంది. ఇందులో భాగంగా రెండు దశాబ్దాలకు పైగా పార్లమెంటులో మూలుగుతున్న బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టింది. కుల రాజకీయాలకు మారుపేరుగా మారిపోయిన భారతదేశంలో బీసీ కులాలను తమ వైపు తిప్పుకుందుకు భారతీయ జనతా పార్టీతో సహా అన్ని పార్టీలు పాచికలు వేస్తున్నాయి. అయితే అధికారంలో ఉన్నారు కాబట్టి బిజేపీ వారు ముందుగా ఈ ఎత్తుగడకు అవకాశం వచ్చింది. స్వయంగా తానను బీసీ ప్రధానిని అని చెప్పుకుంటున్న నరేంద్రమోదీ తన ప్రభుత్వంలోనే బీసీలకు మేలు జరిగిందని చెప్నుకుందుకు ఇదొక ప్రయత్నంగా భావించాలి. బీసీలు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఈ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బీసీ ఓట్లను తమ వైపు తిప్పుకునే పన్నాగం ప్రారంభమైంది.

 

 

ఇక దేశంలో అత్యంత వెనుక బడిన వర్గాల గుర్తింపు కార్యక్రమానికి కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. ఓబీసీల వర్గీకరణ ప్రారంభించి వారి ఓట్లను కూడా కొల్లగొట్టాలన్నది ఆయన అభిమతం. ఆ పనిని కూడా లాంఛనంగా ప్రారంభించారు ప్రధానమంత్రి. కులాలు సమసిపోవాలని వేదికలపై ఊకదంపుడు ప్రసంగాలు చేసే మన నాయకుల తీరు ఎన్నికల ముందు ఎలా మారుతుందో చెప్పడానికి తాజా సంఘటనలే తార్కాణాలు.

 

 

ఎన్నికల తాయిలాలు పంచడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సిద్ధమవుతున్నారు. ఇందులో చాలా ముందున్నది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈయన మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలోని అన్ని కులాల వారిని మచ్చిక చేసుకుందుకు పాచికలు వేస్తున్నారు. ఇక్కడ హామీలు కూడా కులాల వారీగానే ఉండడం గమనార్హం. చేతి వ్రత్తుల వారికి కొన్ని వరాలు.... ఎస్సీ, ఎస్టీలకు కొన్ని వరాలు గుప్పిస్తున్నారు. తాజాగా జోనల్ వ్యవస్ధను తీసుకువచ్చిన కె.చంద్రశేఖరరావు దాని ద్వారా గ్రామీణ స్ధాయి నుంచే తన పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణాలో పంచాయతీల సంఖ్యను పెంచి... అక్కడ ఒక్కో పంచాయతీకి ఒక్కో కార్యదర్శిని నియమిస్తున్నారు. ఇలా నియమింపబడిన కార్యదర్శలు అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులే అయినా.... అనధికారికంగా
మాత్రం " పార్టీ ప్రతినిధులు "గానే పని చేస్తారనేది బహిరంగ రహస్యం. మరోవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా హడావుడిగా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, సింగరేణిలో కారుణ్య నియమాకాలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్ల నియమకం... ఇలా అన్ని రంగాల్లోనూ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీతో యమస్పీడుగా ఉన్నారు. గడచిన నాలుగేళ్లుగా ఇవేమీ గుర్తుకు రాని కల్వకుంట్ల వారికి ఎన్నికల సమయం దగ్గర పడిందని గుర్తు రాగానే రాష్ట్రంలో పెరిగిపోయిన ఉద్యోగ ఖాళీలు గుర్తుకు రావడం ఎన్నికల జిమ్మిక్కుగానే చూడాలి.

 

 

ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధికార తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పేరుకుపోయిన నిరుద్యోగులను తమ వైపు తిప్పుకునేందుకు వారికి నిరుద్యోగ భ్రతి ప్రకటించింది. నెలకు వెయ్యి రూపాయల వంతు ప్రతి ఒక్క నిరుద్యోగికి ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. దీని ద్వారా రాష్ట్రంలో 12 లక్షల మంది నిరుద్యోగులు లబ్దిపొందుతారని ప్రాధమికంగా నిర్ణయించారు. అంటే ఈ 12 లక్షల ఓట్లు తెలుగుదేశానికి పడతాయని, వాటితో పాటు వారి వారి కుటుంబాలకు చెందిన ఓట్లు కూడా తమకే వస్తాయన్నది అపర చాణుక్యునిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడి ఆలోచన. ఇంతకు ముందు ఐదు రూపాయలకే అన్న క్యాంటిన్‌లో భోజనం, రెండు రూపాయలకే అల్పాహారం వంటివి ఏర్పాటు చేయడం కూడా ఓట్ల గారడీలో భాగమే. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు లేవు. ప్రత్యేక హోదా వస్తుందని... పరిశ‌్రమలు వస్తాయని... ఉద్యోగాలు లభిస్తాయని కలలు కన్న నిరుద్యోగులకు కేంద్ర చుక్కలు చూపించింది. దీంతో అక్కడ పరిశ‌్రమలు లేక నిరుద్యోగులు చాలా కాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. 

 

 

నాలుగేళ్ల పాటు భారతీయ జనతా పార్టీతో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా నరేంద్ర మోదీ, అమిత్ షాల రాజకీయ చతురత, నయవంచనకు తేరుకోలేకపోతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే యువత ఓటు ఎంతో అవసరమని భావించిన ఆయన నిరుద్యోగులకు ఈ భ్రతి పథకాన్ని ప్రారంభించారు. నిరుపేదల కోసం అన్న క్యాంటిన్లకు శ్రీకారం చుట్టారు. రాజకీయ పార్టీలు చేపడుతున్న పథకాల కారణంగా ఓట్లు రాలతాయి కాని... దేశంలో ప్రగతి కుంటుపడుతుంది. దేశ ప్రజలు ఏ పని చేయడానికి ముందుకు రారు. ప్రభుత్వాలే అన్ని చూసుకుంటున్నాయి కదా... ఇక మన ఏం చేయాల్సిన అవసరం లేదనే ధోరణి వస్తుంది. ఇది వాంఛనీయం కాదు. ఏ దేశ, రాష్ట్రాల ఎదుగుదలకైనా ఆయా దేశాల, రాష్ట్రాలకు చెందిన ప్రజల భాగస్వామ్యం అవసరం. వారి కఠోర శ్రమ అవసరం. అలా కాకుండా వారికి ఉపాధి చూపించకుండా.... బద్దకస్తులుగా చేయడం దేశానికి, రాష్ట్రాలకు మంచిది కాదు. మన రాజకీయ నాయకులకు ఈ విషయం తెలియంది కాదు. అయితే అధికారమనే కుర్చీ కోసం ఇవన్నీ తప్పవేమో... !!!