రాహుల్‌కు ప్రేమతో.. ఓ బామ్మ ఆస్థి అంతా విరాళం...
Published on: Tue Apr 5, 2022 11:15AM
స్వాతంత్ర సంగ్రామ సమయంలో ఎందరో సామాన్య ప్రజలు తమకున్న సర్వస్వాన్ని దేశం కోసం త్యాగం చేసిన ఉదంతాలు అనేకం చరిత్ర పుటల్లో కనిపిస్తాయి. అయితే, స్వాతంత్రం సిద్దించిన తర్వాత, అలాంటి ఉదంతాలు అంతగా వెలుగులోకి రాలేదు. అమరావతి రైతుల ఆందోళనకు మద్దతుగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుసతీమణి భువనేశ్వరి చేతి గాజులను విరాళంగా ప్రకటించినటువంటి కొన్ని ప్రత్యేక సందర్భాలున్నా, సర్వస్వాన్ని దేశం, , రాష్ట్రం కోసమో, లేదా పార్టీ కోసమో సంర్పించిన సందర్భాలు బహుశా లేవని చెప్ప వచ్చును. అయితే ఇప్పుడు స్వాతంత్ర సంగ్రామ చరిత్రను గుర్తు చేసే సంఘటన ఒకటి ఉత్తరాఖండ్’లో వెలుగులోకి వచ్చింది. ఆ రాష్ట్రానికి చెందిన ఓ వృద్ధురాలు, తనకున్న ఆస్తులన్నంటినీ రాహుల్ పేరు మీద రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అవసరం దేశానికి ఎంతగానో ఉందని, అందుకే తమ ఆస్తుల మొత్తాని ఆయన పేరున బదిలీ చేస్తూ వీలునామా రాసినట్లు ఆమె చెప్పారు.
వివరాలలోకి వెళితే, ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌కు చెందిన 78 ఏళ్ల పుష్ప ముంజియల్‌కు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ అంటే అమితమైన అభిమానం. అలాగే, గాంధీ నెహ్రూ కుటుంబం అంటే ఆమెకు ఎనలేని గౌరవం. ఆ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, అందుకే రాహుల్ గాంధీ, ఆయన కుటుంబం అంటే తనకు గౌరవమని ఆమె చెప్పుకొచ్చారు. ‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకు రాహుల్ కుటుంబం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఆయన అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఈ దేశానికి ఎంతో అవసరం. అందుకే నా మరణాంతరం నా ఆస్తులన్నీ రాహుల్‌కే చెందేలా వీలునామా రాశాను’ అని పుష్ప చెప్పారు.
రాహుల్ గాంధీ సిద్ధాంతాలు నచ్చిన ఆమె, తమ పేరు మీదున్న 50 లక్షల విలువైన ఆస్తులు, 10 తులాల బంగారం రాహుల్ గాంధీకి చెందేలా వీలునామా రాశారు. వీలునామా పత్రాలను పీసీసీ మాజీ చీఫ్ ప్రీతమ్ సింగ్‌కు, అందచేశారు. అలాగే, కోర్టుకు సమర్పించారు.
కాంగ్రెస్ పార్టీ వలన ఎన్నో పదవులు, ఇంకెన్నో ప్రయోజనాలు పొందిన అనేక మంది నాయకులు, కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీని వదిలి పోతున్న సమయంలో పార్టీ నుంచి వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనం పొందని, ఓ సామాన్య మహిళ తమ సర్వస్వాన్ని పార్టీకి విరాళంగా ప్రకటించడం నిజంగా అభినందనీయం, అంటున్నారు.


