TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ద్యావుడా.. 90 సార్లు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వృద్ధుడు.. ఏమైందో తెలుసా?

Published on: Thu Apr 7, 2022 12:40PM

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేష‌న్ జోరుగా సాగుతోంది. రెండు డోసులు తీసుకున్న వారు చాలామందే ఉంటే.. ఇప్ప‌టికీ ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా వేసుకోని వారూ ఎక్కువే. ఎందుకోగానీ, కొంద‌రు టీకాకు స‌సేమిరా అంటున్నారు. అపోహ‌ల‌తో వ్యాక్సిన్ వేయించుకోవ‌డం లేదు. కొన్ని దేశాల్లో కొవిడ్ వ్యాక్సిన్ త‌ప్ప‌నిస‌రి కావ‌డంతో.. ఇష్టం లేక‌పోయినా తీసుకునే వారు కొంద‌రైతే, ఎలాగోలా త‌ప్పించుకుని తిరిగేవాళ్లూ ఉన్నారు. అలాంటిది ఓ వృద్ధుడు డ‌బ్బుల కోసం వ‌రుసబెట్టి వ్యాక్సిన్లు వేయించుకున్నాడు. అలా, ఒక‌టి రెండూ కాదు.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏకంగా 90 డోసుల క‌రోనా టీకా తీసుకున్నాడు. కొంద‌రు ఒక్క డోసుకే హ‌డ‌లిపోతుంటే.. ఆ పెద్దాయ‌న 90 సార్లు వ్యాక్సిన్ తీసుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అన్ని టీకాలు తీసుకున్నా అత‌నికి ఏం కాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగానూ ఉంది. ఇంత‌కీ ఆ వృద్ధుడు అన్ని డోసుల‌ వ్యాక్సిన్ ఎందుకు తీసుకున్న‌ట్టు? 

'కూటి కోసం టీకా విద్యలు' అన్నట్టు.. జర్మనీలో 60 ఏళ్ల వృద్ధుడు డబ్బుల కోసం అన్నేసి వ్యాక్సిన్లు తీసుకున్నాడు. ప్రాణాలను రిస్క్‌లో పెట్టి టీకా స‌ర్టిఫికెట్ కోసం ఏకంగా 90 సార్లు క‌రోనా వ్యాక్సిన్ డోసులు వేయించుకున్నాడు. టీకా తీసుకోవ‌డం ఇష్టం లేని వారు.. ఇత‌నిని ఆశ్ర‌యిస్తే.. వారి నుంచి డ‌బ్బులు తీసుకొని.. వారి పేరు మీదుగా తాను వ్యాక్సిన్ తీసుకునే వాడు. ఆ స‌ర్టిఫికెట్ వారికి అమ్ముకునేవాడు. జ‌ర్మ‌నీలో బ‌య‌ట తిర‌గాలంటే వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రి కావ‌డంతో.. ఇత‌రుల కోసం, డ‌బ్బుల కోసం ఆ పెద్దాయ‌న ఇంత సాహ‌సానికి తెగించాడు. 

శాక్సోనీ స్టేట్‌లోని ఎలెన్ బర్గ్ కేంద్రానికి ఇటీవల ఆ వృద్ధుడు వరుసగా రెండో రోజు వచ్చి టీకా ఇవ్వాలని అడిగాడు. అక్కడ విధుల్లో ఉన్న‌ సిబ్బంది అతడిని గుర్తించి.. నిన్న‌నే క‌దా వ్యాక్సిన్ వేసుకున్నావ్ మ‌ళ్లీ ఇవాళ ఎందుకొచ్చావ‌ని ప్ర‌శ్నించారు. ఆ త‌ర్వాత అనుమానం వ‌చ్చి పోలీసుల‌ను పిలిపించారు. ఆరా తీస్తే.. కొంత‌కాలంగా త‌ను ఇదే ప‌ని మీద ఉన్నాన‌ని.. అదీఇదీ అని కాకుండా.. ఏ కంపెనీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటే ఆ టీకా తీసుకునే వాడిన‌ని చెప్ప‌డంతో అంతా అవాక్క‌య్యారు. అలా ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 90 డోసులు తీసుకున్న‌ట్టు విచార‌ణ‌లో తెలిసింది. మ‌రి, ఇన్ని డోసులు, అన్ని కంపెనీల వ్యాక్సిన్లు తీసుకుంటే అత‌నికి ఏం కాలేదా? అనే యాంగిల్‌లో వైద్యులు త‌దుప‌రి ఆరోగ్య ప‌రీక్ష‌లు చేస్తున్నారు.