ఓలా ఉబర్‌లలో ప్రయాణం క్షేమమేనా!

 

మనలో ఆనుమానం పాళ్లు కాస్త ఎక్కువ. అందుకే ఏదన్నా టెక్నాలజీని అంగీకరించేందుకు పదిసార్లు ముందూవెనకా ఆలోచిస్తాం. అదే సమయంలో వ్యసనం పాళ్లు ఎక్కువే! అందుకే ఏదన్నా అంగీకరించిన తర్వాత, దాన్నే పట్టుకు వేళ్లాడతాం. కంప్యూటర్లు, ఇంటర్నెట్‌, మొబైల్‌ ఫోన్లు, సెల్ఫీలు, ఆన్‌లైన్‌ షాపింగ్‌... ఇలా అన్నింటా భారతీయులే ముందు ఉండటానికి బహుశా కారణం ఇదే! ఇప్పుడు ఈ జాబితాలోకి ఆన్‌లైన్ టాక్సీలు కూడా చేరాయి.

ఒకప్పుడు పదికీ పరకకీ... ఇంకా మాట్లాడితే ఉచితంగా కూడా ఎక్కించుకుంటాం అని చెప్పి ఓలా, ఉబర్‌ లాంటి ఆన్‌లైన్ టాక్సీ ప్రొవైడర్స్ వినియోగదారులని ఆకట్టుకున్నాయి. నిదానంగా డైనమిక్‌ ప్రైసింగ్‌ పేరుతో ట్రాఫిక్‌ని, వాతావరణాన్ని బట్టి ఎడాపెడా ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టాయి. ఏదో వాళ్ల వ్యాపారం వాళ్లది కదా... అని పంటిబిగువున ఓపిక పట్టారు ప్రజలు. కానీ ఇప్పుడు ఏకంగా వినియోగదారుల రక్షణే ప్రశ్నార్థకంగా మారిపోతోంది.

2014లో ఉబర్‌లో ప్రయాణిస్తున్న ఓ అమ్మాయి మీద, డ్రైవర్‌ అత్యాచారం చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందులో ఉబర్‌ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపించింది. ఒక పాత నేరస్తుడిని, కనీసం డ్రైవింగ్‌ లైసన్స్‌ కూడా లేనివాడిని పనిలో పెట్టుకుంది ఉబర్. పైగా ఆ కారుకి జీపీఎస్ ట్రాకింగ్‌ సిస్టం కూడా లేకపోయింది. ఈ సంఘటనతో దిల్లీ ప్రభుత్వం ఏకంగా ఉబర్‌ మీద కొన్నాళ్లపాటు నిషేదమే విధించింది. అయితే ఇది మొదలు మాత్రమే!

గూగుల్‌లో ఇప్పుడు ఓలా లేదా ఉబర్‌ అని టైప్‌ చేస్తే ఏదో ఒక నేరం గురించి కనిపిస్తోంది. ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించారనో, అత్యాచార యత్నం చేశారనో, దురుసుగా ఉన్నారనో... ఏదో ఒక వార్త కనిపిస్తుంది. ఇక వెలుగులోని రాని వార్తల సంగతి దేవుడికెరుక. ఎప్పటిలాగే ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఓలా, ఉబర్‌లు విచారాన్ని వ్యక్తం చేస్తాయి. ప్రయాణికులే తమ దేవుళ్లని ప్రకటనలు గుప్పిస్తాయి. కానీ మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో ఎవరూ చెప్పరు!

ఒక వ్యక్తిని డ్రైవరుగా అంగీకరించి మనం టాక్సీ ఎక్కుతున్నాం అంటే... అతని మీద నమ్మకం ఉండబట్టే! మరి ఆ వ్యక్తి నమ్మకస్తుడని నిర్ధారించేందుకు కంపెనీలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అతని మీద ఎలాంటి కేసులూ లేకుండా ఉండాలి; అతని డ్రైవింగ్‌ని స్వయంగా కంపెనీ ప్రతినిధులు పరిశీలించి చూడాలి; అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలి; ఎప్పటికప్పుడు అతని మానసిక స్థితిని అంచనా వేసే కౌన్సలర్లు ఉండాలి; ప్రయాణీకుల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా సర్వీసు నుంచి తొలగించేంత కఠినంగా ఉండాలి; డ్రైవింగ్‌లో మెలకువలకు, ప్రయాణీకులతో ప్రవర్తించల్సిన తీరు మీద ఎప్పటికప్పుడు రిఫ్రెష్‌మెంట్‌ కోర్సులు నిర్వహించాలి.... వీటిలో ఎన్నింటిని ఓలా, ఉబర్ సంస్థలు పాటిస్తున్నాయి అన్నదే మన సందేహం!

మన దేశంలో నేరాలు వ్యక్తిగతం నష్టం కలిగించనంతవరకూ ఎవరూ పట్టించుకోరు. ప్రభుత్వాలూ అంతే ఉదాసీనంగా ఉంటాయి. అందుకే ఏ రంగంలో అయినా సరే... ప్రైవేట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతుంటారు. ఓలా, ఉబర్‌ల మీద ఇన్ని ఆరోపణలు ఏ ఐరోపా దేశంలోనో వచ్చుంటే వాటి పరిస్థితి ఏంటో వేరే చెప్పనవసరం లేదు!!!