విశాఖ ఆయిల్ రిఫైనరీకి అబుదాబి మంగళం
Published on: Wed May 30, 2012 6:24PM
రాజకీయ పారిశ్రామికరంగంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతి, పారిశ్రామికవేత్తలు, రాజకీయనేతల అరెస్టు కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశాలు భయపడుతున్నాయి. వ్యాన్ పిక్ లో పెట్టుబడులు పెట్టిన రత్ అల్ ఖైమా ఇప్పిటికే చిక్కుల్లో పడింది. ఈ విషయం గమనించిన అబుదాబీ ప్రభుత్వం విశాఖలో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టుకు మంగళం పాడింది. అబుదాబీ ప్రభుత్వం తీర ప్రాంతమైన విశాఖలో సుమారు 40వేల కోట్ల రూపాయల వ్యయంతో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే రిఫైనరీకి దాదాపు 1200 ఎకరాల భూములు ఇచ్చేందుకు పన్నుల్లో రాయితీలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే వాన్ పిక్ ఉదంతంతో అబుదాబీ ప్రభుత్వం భయాందోళనలకు గురైంది. మే 28,29 తేదీల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒప్పందాల గురించి చర్చించడానికి ఆ దేశా ప్రతినిధులు హైదరాబాద్ రావాల్సి ఉంది. ఆ ప్రతినిధులు ఎవరూ రాకపోవటంతో ఈ 40వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు అటకెక్కినట్లు అయింది. ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చిన్న విషయం కాదని, తీరా వచ్చి ఒప్పందం చేసుకున్నాక పరిస్థితులు తారుమారైతే ఇబ్బంది పడతామన్న భయంతోనే అబుదాబీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు నీళ్లు వదిలినట్లు తెలిసింది.


