ఆ పేలుడు తప్పిదం గెయిల్‌దే...

 

తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామంలో జూన్ 27వ తేదీన ఊరంతా గ్యాస్ వ్యాపించి జరిగిన విస్ఫోటనంలో 22 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ పేలుడుకు కారణం పైప్‌లైన్‌ నిర్వహిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్) తప్పిదాలేనని కేంద్ర చమురు మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ తేల్చింది. ఈ దుర్ఘటనపై విచారణకు చమురు మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి(రిఫైనరీస్) రాజేష్‌కుమార్ సింగ్ సారథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సమర్పించింది. గెయిల్ ఏర్పాటు చేసిన ఈ పైప్‌లైనులో నీటితో కూడిన, అధికంగా మండే స్వభావం కల హైడ్రోకార్బన్ల మిశ్రమంతో కూడిన సహజవాయువు సరఫరా అవుతుండడంతో పైపులైను తుప్పుపట్టిపోయి.. అది లీకేజీకి దారితీసిందని, తద్వారా వెలువడిన గ్యాస్ వాతావరణంలోకి దట్టంగా వ్యాపించి.. పేలుడుకు కారణమైందని నివేదిక వెల్లడించింది.