మోడీ హామీని గుర్తుచేయడానికి యువకుడి పాదయాత్ర

 

నాయకులు హామీలు ఇవ్వడం సహజం.. ఆ హామీలను మరిచిపోవడం, మాట తప్పడం కూడా సహజమే.. మరి మోడీ మరిచిపోయారో లేక మాట తప్పారో తెలీదు కానీ ఒక హామీ నెరవేర్చలేదు.. మనమైతే రాజకీయాల్లో ఇదంతా మాములేగా అనుకుంటాం.. కానీ ఒక యువకుడు అలా అనుకోలేదు, మోడీకి హామీని గుర్తు చేయడానికి ఏకంగా 1350 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు.. అసలు విషయం ఏంటంటే..

2015లో మోడీ ఒడిశా వచ్చిన సందర్భంగా ఇస్పాత్ జనరల్ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా చేస్తామని, అలానే బ్రాహ్మణి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.. కానీ ఆ హామీ మాటగానే మిగిలిపోవడంతో.. తన గ్రామం కోసం ముక్తికాంత్ అనే యువకుడు ఒడిశాలోని రూర్కెలా నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేపట్టాడు..

మోడీకి తన హామీని గుర్తు చేసి వీలైనంత త్వరగా హామీ నెరవేర్చమని కోరతానని అంటున్నాడు.. అలానే దేశంలోని చాలా ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేవని, వీటిపై మోడీ దృష్టి పెట్టేలా తనవంతు ప్రయత్నంగా ఈ పాదయాత్ర చేస్తున్నానని ముక్తికాంత్ అన్నాడు.. మరి ఈ యువకుడి ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూద్దాం.