TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో అక్టోపస్ కమాండోల మాక్ డ్రిల్‌!

Published on: Wed Jun 24, 2026 11:37AM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్త జనసందోహంతో కిక్కిరిసి ఉంటుంది. దేశం నలుమూలల నుంచేన కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరమలేశుని దర్శనానికి వస్తుంటారు.  నిత్యం లక్షలమంది అలరారే ఈ పవిత్ర క్షేత్రంలో భద్రత   కీలకం. తిరుమల కొండలపై అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా భద్రతా బలగాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయి. ఇందులో భాగంగానే  తిరుమలలో మంగళవారం (జూన్ 23) రాత్రి ఉగ్రవాద నిరోధక ప్రత్యేక దళం అక్టోపస్ మాక్ డ్రిల్  నిర్వహించింది.  తిరుమల భద్రత లక్ష్యంగా ఈ మాక్ డ్రిల్ సాగింది.  

ఒకవేళ ఉగ్రవాదులు తిరుమలలోకి చొరబడి, కీలకమైన ప్రాంతాలను లేదా భక్తులను తమ అధీనంలోకి తీసుకుంటే వారిని ఎలా మట్టుబెట్టాలనే అంశంపై ఈ మాక్ డ్రిల్ నిర్వహించింది ఆక్టోపస్.. అత్యాధునిక  ఆయుధాలు ధరించిన   45 మందికి పైగా అక్టోపస్ కమాండోలు ఈ  మాక్ డ్రిల్ లో పాల్గొన్నారు. తిరుమలలోని   వెంకటాద్రి నిలయం వద్ద   ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. కమాండోల హఠాత్తు ఎంట్రీ, పొజిషన్స్ తీసుకోవడం, వ్యూహాత్మకంగా ముందుకు కదలడం చూసి అక్కడున్న భక్తులు మరియు స్థానికులు అసలు ఏం జరుగుతుందో తెలియక  ఖంగారు పడ్డారు. ఆందోళన చెందారు.  తరువాత విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

ఈ మాక్ డ్రిల్ లో  అక్టోపస్ దళాలు  అనుమానిత ఉగ్రవాదులుగా నటించిన సిబ్బందిని క్షణాల వ్యవధిలో అధీనంలోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో  టీటీడీ  విజిలెన్స్ విభాగం,   ఆంధ్రప్రదేశ్ సివిల్ పోలీస్  సమన్వయంతో సహకరించాయి.  తిరుమలలో  అక్టోపస్ మాక్ డ్రిల్ వీడియోలు,  ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో   ట్రెండ్ అవుతున్నాయి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, అత్యాధునిక గన్స్ ధరించిన కమాండోల గంభీరమైన లుక్స్ నెటిజన్లను  ఆకట్టుకుంటున్నాయి.  మాక్ డ్రిల్ సందర్భంగా వెంకటాద్రి నిలయం వద్ద ఆంక్షలు విధించారు.