కమ్యూనిష్ఠూరాలు మానుకోవాలి

 

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాను భారత్ పర్యటనకు ఆహ్వానించడం ద్వారా భారత్ అమెరికాకు సలాం కొట్టేందుకు సిద్దంగా ఉందని ప్రపంచ దేశాలకు భారత్ సందేశం ఇచ్చినట్లయిందని సీపీఐ (యం) నేత సీతారామ్ ఏచూరి అన్నారు. భారత్ చిరకాలంగా అనుసరిస్తూ వచ్చిన విదేశీవిదానాన్ని మోడీ ప్రభుత్వం పక్కనబెట్టి అగ్రరాజ్యంకి వంతపాడటం మంచిది కాదని హెచ్చరించారు. ఇరురుగుపొరుగు దేశాలతో సత్సంభందాలు, అన్ని దేశాలకు సమాన దూరం పాటించాలనే విదేశీ విధానమే భారత్ కి బాగా నప్పుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి చాలా నిష్టగా పాటిస్తున్న మన విదేశీవిధానం వలన భారత్ కి ఏమయినా మేలు జరిగిందా? అని ప్రశ్నించుకొంటే లేదనే సమాధానం వస్తుంది. కాశ్మీరులో కొంత భూభాగాన్ని పాకిస్తాన్ దురాక్రమణ చేస్తే భారత్ దానిని కాపాడుకొనే ప్రయత్నం చేయకుండా ఐక్య రాజ్యసమితికి వెళ్లి మొరపెట్టుకొంది. ఆకారణంగానే నేటికీ ఆ భూభాగం పాకిస్తాన్ ఆధీనంలోనే ఉండిపోయింది. అంతేకాదు అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఆ భూభాగం ద్వారా రోడ్లు, రైలు మార్గాలు వేసుకొనేందుకు చైనాకు ధారాదత్తం చేస్తోంది కూడా. అంతేకాదు మొగుడిని కొట్టి బజారు కెక్కినట్లుగా పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై భారత్ నే దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. గత మూడు దశాబ్దాలుగా చైనా, పాకిస్తాన్ దేశాలు భారత్ కి పక్కలు బల్లెంలా తయారయ్యాయి అంటే అందుకు మన బలహీనమయిన విదేశీ విధానాలే కారణమని చెప్పకతప్పదు.

భారత్ ఏనాడూ కూడా తనంతట తానుగా  ఇరుగుపొరుగు దేశాల మీద యుద్దానికి బయలుదేరలేదు. కానీ పాకిస్తాన్ గత ముప్పై ఏళ్ళుగా భారత్ మీద పరోక్ష యుద్ధం చేస్తూనే ఉంది. చైనా దేశం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తన భూభాగమేనని దైర్యంగా చూపుకొంటోంది. అంతే కాదు అనేకసార్లు భారత భూభాగంలో చొరబడి అది మాదేనని దైర్యంగా వాదించగలిగింది. అయినా భారత్ వారిని ఏమీ చేయలేక నిస్సహాయంగా శాంతి మంత్రం జపిస్తూనే ఉండిపోవడానికి కారణం లోపభూయిష్టమయిన మన విదేశీ విధానాలే. వాటి వలన భారత్ అంటే ప్రపంచ దేశాలకు ఒకరకమయిన చిన్న చూపు ఏర్పడింది. భారత్ చాలా బలహీనమయిన దేశమని, దైర్యంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదనే అభిప్రాయం ఏర్పడింది. అందుకే అతి చిన్న దేశమయిన శ్రీ లంక సైతం తనకు కష్టకాలంలో సహాయం చేసిన భారత్ ని కాదని దురాక్రమణదారుగా పేరుమోసిన  చైనాకు దగ్గరవుతోంది. భారతజాలర్లను జైల్లో వేస్తూ, భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చైనాకు చెందిన అణుబాంబులు ప్రయోగించే సామర్ధ్యం ఉన్న రెండు సబ్-మెరయిన్లను తన పోర్టులో నిలిపిఉంచుకొనేందుకు అనుమతించింది. శ్రీలంక యల్.టీ.టీ.ఈ ఉగ్రవాదులతో నానా ఇబ్బందులు పడుతునప్పుడు, దానికి సహాయపడేందుకు భారత్ తన సేనలను పంపించింది. ఆ కారణంగానే భారత్ తన ప్రధాని రాజీవ్ గాంధీని కోల్పోయింది.

ఇటువంటి లోపభూయిష్టమయిన విదేశీ విధానాలను నిఖచ్చిగా అమలు చేయాలని సీతారామ్ ఏచూరి వంటి రాజకీయ మేధావి కోరితే అంత కంటే పొరపాటు మరొకటి ఉండబోదు. ఆయన వామపక్ష పార్టీలకు చెందిన వారు కనుక పెట్టుబడిదారు దేశమయిన అమెరికాను దానితో స్నేహాన్ని వ్యతిరేకించడం సహజమే. కానీ ఆయన చైనా దేశం మన దేశం పట్ల వ్యవహరిస్తున్న తీరును కూడా ఇంతే గట్టిగా ఖండించి ఉంటే, ఆయన మాటలకు విలువ ఉండేది. నిజమే! అమెరికాతో స్నేహం లేదా యుద్ధం చేసిన ఏ దేశమయినా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. కానీ అలాగని మన చిరకాల మిత్ర దేశమయిన రష్యాకు కూడా మనం దూరం అయ్యి చాలా కాలమే అయ్యింది. మనకు సరయిన విదేశీ విధానం లేకపోవడం, నిర్దిష్టమయిన అభిప్రాయాలు, అవసరమయినప్పుడు బలమయిన, కటినమయిన  నిర్ణయాలు తీసుకొనే తెగువ లేకపోవడం చేతనే చిన్నచిన్నదేశాలకి సైతం మనం చులకనయిపోయాము. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటివరకు ఇన్ని అనర్ధాలు జరుగుతున్నా, లోపభూయిష్టమయిన విదేశీ విధానానికే గుడ్డిగా అనుసరితున్నాము. కానీ నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన వెంటనే ప్రపంచ దేశాలకు భారత్ సత్తా చాటే విధంగా సరికొత్త విదేశీ విధానాలను అవలంభిస్తుంటే దానిని మెచ్చుకోకపోగా కొందరు విమర్శించడం చాలా విచారకరం. ఆయన అధికారం చేప్పట్టిన వెంటనే అమెరికా వెళ్ళలేదు. మనకి చిరకాలంగా మిత్రదేశాలుగా ఉన్న భూటాన్, నేపాల్, జపాన్ దేశాలకు వెళ్ళారు. ఒకప్పుడు తనకు వీసా నిరాకరించిన అమెరికా చేతనే ఆహ్వానింపజేసుకొన్న తరువాతనే ఆయన అమెరికాలో కాలు పెట్టారు. భారతదేశాన్ని వేగంగా అభివృద్ధి పదంలో పరుగులు తీయించాలంటే అగ్రరాజ్యమయిన అమెరికా సహాయసహకారాలు కూడా చాలా అవసరమని గ్రహించినందునే, ఆయన అమెరికా అధ్యక్షుడిని భారత్ కి ఆహ్వానించారు. ఒబామా కూడా పాత పద్దతులు, సంప్రదాయాలు పక్కనబెట్టి, తను భారత్ రాబోతున్నట్లు తక్షణమే ప్రకటించేరు. మోడీ అనుసరిస్తున్న నూతన విదేశీ విధానం వలన, అది ప్రపంచ దేశాలకు ఇస్తున్న బలమయిన సంకేతాల కారణంగానేఇది సాధ్యమయిందని చెప్పవచ్చును.

అమెరికా అధ్యక్షుడు భారత్ పర్యటన వలన భారత్ కి అనేక ప్రయోజనాలు చేకూరాయి. ఒకవేళ మోడీ అనుసరిస్తున్న ఈ విదేశీ విధానాలలో ఏమయినా లోపాలు ఉన్నట్లయితే, వాటిని ఆయనకు దృష్టికి తీసుకువచ్చి అప్రమత్తం చేయవలసిన బాధ్యత ప్రతిపక్షల మీదే ఉంది. కానీ గుడ్డిగా విమర్శించడం మాత్రం మంచిది కాదు. భారత ప్రధానిగా ఆయన దేశ భవిష్యత్తుకి ఏది మంచిదో అదే చేయాలనుకొంటారు తప్ప ఎవరినో ప్రసన్నం చేసుకొనేందుకు భారత్ ప్రయోజనాలను నష్టపరుచుకోవాలనుకోరు అనే సంగతిని సీతారామ్ ఏచూరి వంటివారు కూడా గుర్తుంచుకోవాలి.